Ambani case: ప్రదీప్‌ ఆదేశాలతోనే రంగంలోకి హంతకులు..! 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి బెదిరింపుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఒకప్పటి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులు పరస్పరం సహకరించుకొన్నారని

Published : 18 Jun 2021 11:49 IST

ఆంటిలియా కేసులో కొత్త మలుపులు

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి బెదిరింపుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఒకప్పటి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులు పరస్పరం సహకరించుకొన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధరణకు వచ్చింది. వీరిద్దరి కనుసన్నల్లోనే అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు పెట్టిన కారును ఉంచడం, కీలక సాక్షి మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఘటనలు జరిగిన తొలినాళ్లలోనే ప్రదీప్‌ శర్మను ఎన్‌ఐఏ అధికారులు అనుమానించారు. కానీ, అతడు వారిని తప్పుదోవ పట్టించి బయటపడ్డాడు. కానీ, రెండోసారి ఎన్‌ఐఏ బలమైన సాక్ష్యాలతో ప్రదీప్‌ను అరెస్టు చేసింది.

ఇప్పుడు కొత్తగా ఎన్‌ఐఏ ఏం గుర్తించిందంటే..

ఈ కుట్రలో సచిన్‌ వాజేతోపాటు ప్రదీప్‌ శర్మ పాత్ర కూడా చాలా లోతుగా ఉందని ఎన్‌ఐఏ గుర్తించింది. సచిన్‌ వాజేకు అవసరమైన మనుషులను అతనే సమకూర్చినట్లు తేల్చింది. అంబానీ ఇంటి వద్ద ఉంచిన స్కార్పియో కారు యజమాని మన్‌సుఖ్‌ అప్రూవర్‌గా మారతాడనే అనుమానంతో అంతం చేశారు. మన్‌సుఖ్‌ కిడ్నాప్‌, హత్యకు మనుషులను పురమాయించింది ప్రదీపే అని తేలింది. వీరిలో షెలర్‌, జాదవ్‌ అనే ఇద్దరిని జూన్‌ 11వ తేదీనే అరెస్టు చేశారు. మనీష్‌ బసంత్‌, సతీష్‌ తిరుపతి మోతకూరి అనే వ్యక్తులను నిన్న అరెస్ట్‌ చేశారు. శర్మను అరెస్టు చేసిన సమయంలో అతడి వద్ద ఒక తుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఆ తుపాకీ లైసెన్స్‌ తేదీ ముగిసిపోయింది. ఈ కేసులో ప్రదీప్‌ పాత్రను వెల్లడించేలా డిజిటల్‌, డాక్యుమెంట్స్‌ సాక్ష్యాలను ఎన్‌ఐఏ సేకరించింది.

మన్‌సుఖ్‌ను నమ్మించి కిడ్నాప్‌ చేసి..

ఫిబ్రవరి 26వ తేదీన అంబానీ ఇంటి వద్ద కారు బాంబును స్వాధీనం చేసుకొన్న అనంతరం మన్‌సుఖ్‌ హిరేన్‌ బాగా భయపడిపోయాడు. అక్కడ ఉంచిన కారు తనది కావడంతో అరెస్టు చేస్తారనుకున్నాడు. అదే సమయంలో సచిన్‌ వాజే అతన్ని పోలీసులకు లొంగిపొమ్మని ఒత్తిడి చేశాడు. కానీ, అందుకు మన్‌సుఖ్‌ నిరాకరించాడు. దీంతో విషయం బయటకు పొక్కితే ప్రమాదకరమని భావించిన సచిన్‌వాజే అతడిని అంతం చేయాలనుకున్నాడు. ప్రదీప్‌ శర్మ సాయంతో అందుకు అవసరమైన మనుషులను సమకూర్చుకొన్నాడు.  మార్చి  4వ తేదీన వినాయక్‌ షిండే అనే మాజీ పోలీస్‌తో మన్‌సుఖ్‌కు ఫోన్‌ చేయించాడు. షిండే తనను తాను ‘తావ్‌డే’ అనే పేరుతో పరిచయం చేసుకొని.. మన్‌సుఖ్‌ దాక్కోవడానికి సురక్షిత ప్రదేశం చూపిస్తానని నమ్మబలికినట్లు సమాచారం. ఈ క్రమంలో సచిన్‌ వాజే, మరో పోలీస్‌ అధికారి సునీల్‌ మనేలు అతన్ని కారులో ఎక్కించుకొని ఒక లాడ్జ్‌ దగ్గర 26 నిమిషాలు ఉన్నారు. అనంతరం టవేరాలో  సిద్ధంగా ఉన్న ప్రదీప్‌ మనుషులకు అతన్ని అప్పజెప్పారు. తర్వాత సచిన్‌ ఏమీ తెలియనట్లు రైల్లో తిరిగి ముంబయి చేరుకొన్నాడు. అనంతరం ఒక బార్‌పై నకిలీ రైడింగ్‌ చేశారు. మన్‌సుఖ్‌ ఫోన్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొన్న సునీల్‌ మనే.. వాటిని విరోర్‌ వద్ద పారేశాడు. ఆ తర్వాత  తుంగరేశ్వర్‌ వద్ద తన ఫోన్‌ ఆన్‌ చేశాడు. ఇదంతా దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే అని భావిస్తున్నారు. ఇక హంతకులు కారులోనే మన్‌సుఖ్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం నోట్లో గుడ్డలు కుక్కి ముంబ్రా ప్రాంతంలోని సముద్రంలో పడేశారు.

టవేరాలో కీలక డీఎన్‌ఏ..

మన్‌సుఖ్‌ కిడ్నాప్‌కు వినియోగించినట్లు అనుమానిస్తున్న టవేరా కారులో కీలక డీఎన్‌ఏను జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. దీనిని పుణెలోని ఫోరెన్సిక్‌ పరిశోధన శాలకు తరలించింది. వీటి ఫలితాలు రావాల్సి ఉంది. ప్రదీప్‌ అనుచరుల అరెస్టు సమయంలో భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఇది హంతకులకు చెల్లింపులు చేసిన మొత్తం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్య ముగిశాక ఫోన్లు.. ఆ సిగ్నల్సే కీలక లింక్‌..!

ప్రదీప్‌ శర్మ, సచిన్‌ వాజే ఈ కుట్రలో ఉన్నారనడానికి ఓ వాట్సాప్‌ కాల్‌ సిగ్నల్సే కీలక లింక్‌గా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. దీనిని తొలుత మహారాష్ట్ర ఏటీఎస్‌ గుర్తించింది. ఈ కేసులో నిందితుడైన సునీల్‌ మనే నుంచి మన్‌సుఖ్‌ హిరేన్‌కు వాట్సాప్‌ కాల్స్‌ వెళ్లాయి. ఆ నంబర్‌ లొకేషన్‌ అంధేరీలో ప్రదీప్‌ ఇంటి వద్ద చివరి సారి చూపించింది. దీంతోపాటు నిందితులు షెలర్‌, జాదవ్‌ కూడా ప్రదీప్‌ పాత్రపై నోరు విప్పడంతో ఎన్‌ఐఏ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. కిరాయి హంతకులు కూడా మన్‌సుఖ్‌ హత్య తర్వాత ప్రదీప్‌, సచిన్‌కు ఫోన్లు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ఈ కేసులో తనను కొందరు పోలీసు అధికారులు కావాలనే ఇరికిస్తున్నారని ప్రదీప్‌ కోర్టుకు వెల్లడించాడు. తాను సచిన్‌ వాజేతో టచ్‌లో లేనని తెలిపారు. ముంబయి పోలీసుల్లో ఒక వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేసి ఈ కేసులో ఇరికిస్తోందని న్యాయస్థానానికి వెల్లడించాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts