Anil Deshmukh: అనిల్‌ దేశ్‌ముఖ్‌పై బిగుస్తున్న ఉచ్చు.. లాయర్‌ అరెస్టు

ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనకు అనుకూలంగా వ్యహరించేందుకు లంచం తీసుకున్నారన్న

Published : 02 Sep 2021 12:22 IST

దిల్లీ: ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనకు అనుకూలంగా వ్యహరించేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఎస్‌ఐని అరెస్టు చేయగా.. తాజాగా అనిల్‌ న్యాయవాది ఆనంద్‌ దాగాను కూడా దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. మాజీ మంత్రిపై ప్రాథమిక దర్యాప్తునకు ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు వెనక్కి తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలపై లాయర్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ నిమిత్తం న్యాయవాదిని ముంబయి నుంచి దిల్లీ తీసుకెళ్లారు. 

అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రాగా.. బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో ఆయనకు అనుకూలంగా ప్రాథమిక విచారణలో జోక్యం చేసుకునేందుకు సీబీఐ ఎస్‌ఐ అభిషేక్‌ తివారీ లంచం స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, ప్రాథమిక దర్యాప్తులో అనిల్‌కు క్లీన్‌చిట్‌ రానుందంటూ గత శనివారం ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆ వార్తలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఎస్‌ఐ తివారీ, అనిల్‌ న్యాయవాది ఆనంద్‌, మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నిన్న సాయంత్రం ఎస్‌ఐను.. నేడు లాయర్‌ను  అరెస్టు చేసింది. 

బార్‌ యజమానుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని దేశ్‌ముఖ్‌ పోలీసులకు లక్ష్యంగా పెట్టారని ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఏప్రిల్‌లో ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ కూడా రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ్‌ముఖ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పరమ్‌బీర్‌ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు... సీబీఐని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని