Rajnath Singh: వారు దేశానికి విలువైన సంపద: రాజ్‌నాథ్‌

దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికుల సంక్షేమం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి బాధ్యతగా భావించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. 

Published : 30 Nov 2022 01:28 IST

దిల్లీ: దేశ భద్రత బలంగా లేకుంటే ఆ దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందలేవని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. మంగళవారం మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షణ బలగాల ఫ్లాగ్‌ డే సీఎస్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికుల సంక్షేమం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని,  ప్రజలందరి బాధ్యతగా భావించాలని సూచించారు. రక్షణ బలగాల ఫ్లాగ్ డే ఫండ్‌కు ప్రజలు ఉదారస్వభావంతో విరాళాలు ఇవ్వాలని కోరారు. దేశ భద్రత బలంగా లేకుంటే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ది చెందవని గుర్తుచేసిన రాజ్‌నాథ్‌, కొన్నేళ్లుగా రక్షణ బలగాల సహాయనిధికి  కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇవ్వడం ప్రశంసనీయమని అన్నారు. 

‘‘దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి సరిహద్దుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో ఎంతో మంది వీర మరణం పొందారు. వారిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత. ఇందుకోసం ప్రతి పౌరుడు తమకు తోచిన విధంగా సాయం చేయాలి. సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత, త్యాగాల ఫలితంగానే దేశంలో మనం ఎలాంటి భయం లేకుండా జీవించగలుగుతున్నాం’’ అని రాజనాథ్‌ అన్నారు. 

ఏటా 60 వేల మంది సైనికులు 35 నుంచి 40 మధ్య వయస్సులోనే పదవీ విరమణ తీసుకుంటున్నారని తెలిపారు. అలాంటి వారికి ప్రైవేటు కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. దీనివల్ల ఆయా సంస్థలు ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు, మాజీ సైనికులు మెరుగైన జీవితం జీవించేందుకు కృషి చేసినట్లు అవుతుందని రాజ్‌నాథ్‌ అన్నారు. ప్రభుత్వం మాజీ సైనికులను విలువైన సంపదగా భావిస్తుందని, వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ బలగాల ఫ్లాగ్‌ డే ఫండ్‌ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని