శభాష్‌ సైనికా.. మీ తెగువకు వందనం

మంచు ఫలకాల కింద చిక్కుకుపోయిన ముగ్గురు సైనికుల మృతదేహాలను అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ వెలికి తీయడాన్ని విశ్రాంత ఆర్మీ అధికారి బ్రిగేడియర్‌ హర్‌దీప్‌ సింగ్ సోహి అభినందించారు. 

Published : 11 Jul 2024 17:16 IST

దిల్లీ: వాళ్లంతా సైనికులు. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధవ్యూహాలను ఎలా అమలు చేయాలో నేర్చుకోవడంలో భాగంగా లద్దాఖ్‌లోని (Ladakh) కున్‌ (KUN) పర్వతాన్ని అధిరోహించేందుకు బయలు దేరారు. మొత్తం 38 మంది వెళ్లగా... హఠాత్తుగా హిమపాతం సంభవించింది. 34 మంది బయటపడగా.. నలుగురు మాత్రం అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి.. అందులో ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. మిగతవారి మృతదేహాలు లభ్యంకాలేదు. అనంతరం 9 నెలల తర్వాత మిగతా ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. గత ఏడాది అక్టోబరు 8న ఈ ఘటన జరిగింది. 

దీనిపై విశ్రాంత ఆర్మీ అధికారి బ్రిగేడియర్‌ హర్‌దీప్‌ సింగ్‌ సోహి (Brigadier Hardeep Singh Sohi) ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. హై ఆల్టిట్యూడ్‌ వార్‌ఫేర్‌ స్కూల్‌ (HAWS) సైనికుల ధైర్యసాహసాలను అభినందించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి.. అమరవీరుల మృతదేహాలను బయటకు తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్‌ 8న జరిగిన ప్రమాదంలో హవల్దార్‌ రోహిత్‌ కుమార్‌, హవల్దార్‌ ఠాకూర్‌ బహదూర్‌, నాయక్‌ గౌతమ్‌లు, లాన్స్‌ నాయక్‌ స్టాన్జిన్‌లు మంచు ఫలకాల కింద చిక్కుకొని ప్రాణాలు విడిచారు. అదే రోజున 6 గంటల పాటు శ్రమించి స్టాన్జిన్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో మిగతా వారిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. 

‘సైనికుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇంత సమయమా?’ అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న సందేహాలను హర్‌దీప్‌ సింగ్‌ నివృత్తి చేశారు. ‘‘ ఇంత ఆలస్యమా? అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆరు గంటల్లోనే ఒక దేహాన్ని బయటకు తీసిన సైనికులు మిగతా వారిని ఎందుకు తేలేకపోయారు? మనం కూడా  కాస్త ఆలోచించాలి. అక్కడి పరిస్థితులు అసాధారణంగా ఉంటాయి. దాదాపు 70 అడుగుల లోతులో కూరుకు పోయిన మృతదేహాలను గుర్తించడం అంత సులభం కాదు. మరోవైపు ప్రతికూల పరిస్థితులు కూడా అడ్డంకిగా మారుతాయి. ఏ ఒక్క మృతదేహాన్ని వదలకూడదనే సంకల్పంతో ఈసారి సైనికులు అత్యాధునిక పరికరాలను, రెక్కో (RECCO) రాడార్లను తీసుకెళ్లారు. 9 రోజులు కష్టపడితేగానీ మృతదేహాలు వెలికితీయడం సాధ్యం కాలేదు.’’ అని వివరించారు.

హెచ్‌ఏడబ్ల్యూఎస్‌కు చెందిన సైనికులు పర్వతారోహణను గతేడాది అక్టోబర్‌ 1న ప్రారంభించి... అక్టోబర్‌ 13 నాటికి కున్‌ పర్వత శిఖరాన్ని చేరుకోవాల్సి ఉంది. అయితే, అక్టోబర్‌ 8 నాటికి సుమారు 18,300 అడుగుల ఎత్తుకు  చేరారు. అప్పుడే ఈ ఘటన జరిగింది. అయితే, మంచు ఫలకాల కింద ఏ ఒక్కర్నీ వదలకూడదన్న దృఢసంకల్పంతో హెచ్‌ఏడబ్ల్యూఎస్‌ డిప్యూటీ కమాండెంట్‌ బ్రిగేడియర్‌ ఎస్‌ఎస్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో పర్వతారోహకుల బృందం జూన్‌ 18న ఆపరేషన్‌ ఆర్‌.టి.జి. (రోహిత్‌, ఠాకూర్‌, గౌతమ్‌) చేపట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న తర్వాత తొమ్మిది రోజుల పాటు తీవ్రంగా శ్రమించి మృతదేహాలను వెలికి తీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని