కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య

దివంగత కేంద్ర మాజీ మంత్రి పి.ఆర్‌.కుమారమంగళం సతీమణి కిట్టీ కుమారమంగళం హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దిల్లీ వసంత్‌ విహార్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం జరిగింది....

Updated : 07 Jul 2021 12:17 IST

దిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి పి.ఆర్‌.కుమారమంగళం సతీమణి కిట్టీ కుమారమంగళం హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దిల్లీ వసంత్‌ విహార్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కిట్టీ కుమారమంగళం ఆమె నివాసంలో మరో సహాయకురాలితో కలిసి నివాసముంటున్నారు. తరచూ బట్టలు ఉతకడానికి వచ్చే ఓ వ్యక్తి మంగళవారం రాత్రి తలుపు కొట్టాడు. తెలిసినవాడు కావడంతో ఇంట్లోని సహాయకురాలు లోపలికి అనుమతించింది. ఆ దుండగుడు వెంటనే ఆమెను ఓ గదిలో తాడుతో కట్టి బందించాడు. ఆ వెంటనే మరో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించి కిట్టీ కుమారమంగళాన్ని దిండుతో ముఖంపై అదిమి హతమార్చారు. తర్వాత ఇంట్లో దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.

కొద్దిసేపటి తర్వాత సహాయకురాలు కట్లను విప్పుకొని అలారం ఆన్‌ చేసి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిట్టీ మరణించినట్లు ధ్రువీకరించుకున్నారు. తర్వాత సహాయకురాలిని వివరాలు అడిగి తరచూ బట్టలు ఉతకడానికి వచ్చే వ్యక్తిని అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించిన దుండగుడు మరో ఇద్దరి పేర్లను బయటపెట్టాడు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

కిట్టీ కుమారమంగళం భర్త పి.రంగరాజన్‌ కుమారమంగళం సేలం (1984-1996), తిరుచిరపల్లి (1998-2000) నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పీవీ నర్సింహారావు హయాంలో న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. తర్వాత భాజపాలో చేరిన ఆయన వాజ్‌పేయీ కేబినెట్‌లో విద్యుత్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000, ఆగస్టు 23న కన్నుమూశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు