Updated : 19 Aug 2022 15:02 IST

Manish Sisodia: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారులో మరోసారి సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. దిల్లీ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో నేడు సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. మద్యం విధానంపై దాఖలైన కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. సిసోదియా నివాసంతో పాటు దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని 21 చోట్ల ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తులో భాగంగా నేడు సోదాలు చేపట్టింది. సిసోదియా నివాసం, కార్యాలయంతో పాటు మాజీ ఎక్సైజ్‌ కమిషనర్‌ గోపీకృష్ణ తదితరుల ఇళ్లల్లో తనిఖీలు జరుపుతోంది.

సీబీఐకి స్వాగతం: సిసోదియా

సీబీఐ దాడుల విషయాన్ని మనీశ్ సిసోదియా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు. ‘‘మా ఇంట్లో సీబీఐ అధికారులకు స్వాగతం పలికాం. దర్యాప్తునకు మా వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. అప్పుడే నిజానిజాలు త్వరగా బయటకు వస్తాయి. అప్పటిదాకా నా మీద ఎన్నికేసులు పెట్టినా ఏమీ జరగదు. ఉత్తమ విద్య కోసం నేను చేస్తోన్న కృషిని ఎవరూ ఆపలేరు. అయితే.. దేశం కోసం మంచి పనులు చేస్తోన్న వారిని ఇలా వేధించడం దురదృష్టకరం. అందుకే మన దేశం నంబర్‌ వన్‌గా మారలేకపోతోంది’’ అని సిసోదియా మండిపడ్డారు. కొంతమంది కావాలనే దిల్లీలో విద్య, వైద్య శాఖలపై ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి దుయ్యబట్టారు. ఈ రంగాల్లో జరుగుతోన్న మంచిని ఆపాలనే ఉద్దేశంతోనే తమపై అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలేనని, నిజాలన్నీ కోర్టులోనే బయటకు వస్తాయన్నారు.

మంచిపనికి రివార్డ్‌ ఇది: కేజ్రీవాల్‌

సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. తాము చేస్తోన్న మంచి పనులకు కేంద్రం ఇస్తోన్న బహుమానం ఇదేనంటూ దుయ్యబట్టారు. ‘‘ఈరోజే దిల్లీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ను అభినందిస్తూ అమెరికా దిగ్గజ వార్తాపత్రిక అయిన న్యూయార్క్‌ టైమ్స్‌లో మొదటిపేజీలో కథనం వచ్చింది. మనీశ్‌ సిసోదియా ఫొటోను కూడా ప్రచురించారు. ఇదే రోజు ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. మంచి పనికి లభించిన ఫలితమిది. అయితే మేం సీబీఐకి స్వాగతం పలుకుతున్నాం. దర్యాప్తునకు సహకరిస్తాం. గతంలోనూ మా నేతలపై దాడులు జరిగాయి. అప్పుడు వారికి ఏం దొరకలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. ఇప్పటికే దిల్లీ వైద్యారోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ అరెస్టయిన విషయం తెలిసిందే.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని