ఎగ్జిట్‌ పోల్‌: ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిదనే విషయంపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.

Updated : 29 Apr 2021 21:00 IST

సర్వేలు ఏం చెబుతున్నాయంటే..

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్‌(294), తమిళనాడు(234), అస్సాం(126), కేరళ(140), పుదుచ్చేరి(30) రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గెలుపెవరిదనే విషయంపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.

స్టాలిన్‌కే తమిళనాడు పగ్గాలు..?

హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డీఎంకే అధినేత స్టాలిన్‌ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలన్ని స్టాలిన్‌కే అత్యధిక ఆధిక్యం రానున్నట్లు ప్రకటించాయి. రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్‌ సర్వేలో 160నుంచి 170 స్థానాల్లో డీఎంకే గెలుపొందే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇక అధికారంలో ఉన్న ఏఐఏ డీఎంకేకు కేవలం 58-68 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక మరోసంస్థ పీమార్క్‌ చేసిన సర్వేలోనూ స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కూటమి 165-190 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక పళనిస్వామి పార్టీ మాత్రం 40 నుంచి 65 స్థానాల్లోనే గెలుపొందే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఏబీపీ సీఓటర్‌ సర్వే కూడా డీఎంకే 160-172 స్థానాల్లో గెలుస్తుందని లెక్కగట్టింది. ఇలా దాదాపు అన్ని సర్వేలు స్టాలిన్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందుతారని అంచనా వేశాయి. ఇక టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని ఏఎంఎంకే కేవలం రెండు నుంచి నాలుగు స్థానాల్లో గెలుపొందే అవాకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్ సర్వేలు అంచనా వేశాయి.

ఇదిలాఉంటే, తమిళనాడులో రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన తొలి ఎన్నికల సంగ్రామం ఇదే కావడంతో అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే కూటములతో పాటు కొత్త పార్టీలు ప్రభావం ఏవిధంగా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇక రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో కూర్చున్న డీఎంకే మాత్రం ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తాజా సర్వేల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్‌ కొళత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీలో దిగారు. ఈ స్థానం నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచిన స్టాలిన్‌, హ్యాట్రిక్‌ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

హ్యాట్రిక్‌ కొట్టనున్న దీదీ..?

గతంలో ఎన్నడూ చూడనివిధంగా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తీవ్ర ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరకు తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. దీంతో మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అయితే, రెండు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండనున్నట్లు లెక్కగట్టాయి. గతంలో లేని విధంగా భాజపా భారీ ఓట్ల శాతాన్ని కౌవసం చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. టైమ్స్‌నౌ జరిపిన సర్వేలో టీఎంసీకి 158 స్థానాలు, భాజపాకు 115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్‌ జరిపిన సర్వేలో టీఎంసీ 128 నుంచి 138 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఇక భాజపా 128 నుంచి 138 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక పీమార్క్‌ సర్వే ప్రకారం, తృణమూల్‌-158, భాజపా-120, వామపక్షాలు 14 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. ఈటీజీ రీసెర్చ్‌ చేసిన సర్వేలోనూ టీఎంసీ 169 స్థానాల్లో, భాజపా 110 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది. ఇక సీఎన్‌ఎన్‌ న్యూస్‌18 అంచనా ప్రకారం, మమతా బెనర్జీకి 162, భాజపాకు 115 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని సర్వేల్లోనూ వామపక్షాలకు కేవలం 13 నుంచి 19 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం భాజపా, తృణమూల్‌ మధ్య తీవ్ర పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే,  గత ఎన్నికల్లో దాదాపు 200 స్థానాల్లో విజయం సాధించిన తృణమూల్‌ ఈసారి దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో కోల్పోయే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ వామపక్ష కూటమీ మరింత దిగజారిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక క్రితం ఎన్నికల్లో కేవలం 34 స్థానాల్లో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఈపారి భారీగా పుంజుకున్నట్లు అర్థమవుతోంది. మునుపటి కంటే దాదాపు 80 నుంచి 90 స్థానాలు అధికంగా కైవసం చేసుకోనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

పశ్చిమ బెంగాల్‌..

  భాజపా+ టీఎంసీ+ ఇతరులు
రిపబ్లికన్‌ సీఎన్‌ఎక్స్‌ 138-148 128-138 1-10
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 143 133 16
ఏబీపీ  సీ ఓటర్‌ 109-121 152-164 14-25
జన్‌కీ బాత్‌ 162-185 121-104 9-3
పి-మార్క్‌ 112-132 152-172 10-20
టైమ్స్‌ నౌ సీ ఓటర్‌ 115 158 80

అస్సాం

  భాజపా+ కాంగ్రెస్‌+ ఇతరులు
ఇండియాటుడే 75-85 40-50 1-4
       

తమిళనాడు

  డీఎంకే+ అన్నాడీఎంకే+ ఇతరులు
రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్‌ 160-180 58-68 0-10
టు డేస్‌ చాణక్య 164-186 46-68 0-6

కేరళ

  ఎల్డీఎఫ్‌ యూడీఎఫ్‌ భాజపా
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 76 61 3
ఇండియా టుడే 104-120 20-36 0-2

పుదుచ్చేరి

  భాజపా+ కాంగ్రెస్‌+ ఇతరులు
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 18 12 0
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని