అంబానీకి బెదిరింపుల కేసులో సచిన్‌ వాజే గురువు‌..!

ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముంబయికి చెందిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాజేను

Updated : 17 Jun 2021 15:49 IST

ఎన్‌ఐఏ అదుపులో మరో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద బాంబు బెదిరింపుల కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముంబయికి చెందిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకొంది. తాజాగా సచిన్‌ వాజేకు తొలినాళ్లలో గురువుగా వ్యవహరించిన ప్రదీప్‌ శర్మ హస్తం కూడా ఈ కేసులో ఉన్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామున ఆయన నివాసంపై దాడులు నిర్వహించింది. ఉదయం 5 గంటలకు ఎన్‌ఐఏ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు అంధేరీలోని అతని ఇంటి వద్దకు చేరుకొన్నాయి. దాదాపు 6 గంటల పాటు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం ప్రదీప్‌ శర్మను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. 

ఎన్‌ఐఏకు అనుమానం దేనికి..?

ఈ కేసులో సంతోష్‌ షెలర్‌ అనే వ్యక్తిని ఇటీవలే ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. జూన21 వరకు కస్టడీలోకి తీసుకొంది. ఈ క్రమంలో ప్రదీప్‌ శర్మతో సంతోష్‌ దిగిన ఒక ఫొటో ఎన్‌ఐఏకు లభించింది. దీంతో అతన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో సచిన్‌ వాజేతో సంబంధాలున్న కారణంగా ప్రదీప్‌ను ఇప్పటికే ఒక సారి ఎన్‌ఐఏ ప్రశ్నించింది.  తాజాగా సంతోష్‌తో కూడా ప్రదీప్‌ శర్మకు పరిచయం ఉండటంతో మరోసారి విచారణకు తీసుకెళ్లింది. ప్రదీప్‌ శర్మ మాత్రం ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. సంతోష్‌ పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అని పేర్కొన్నారు. అయినా, తనతో వేల మంది ఫొటోలు దిగారని.. అలాగే సంతోష్‌ కూడా అని వెల్లడించాడు. 

సంతోష్‌ షెలర్‌, ఆనందర్‌ జాదవ్‌ అనే వ్యక్తులను లాతూరు జిల్లా నుంచి ఎన్‌ఐఏ అధికారులు జూన్‌ 11వ తేదీన అరెస్టు చేశారు. ఆంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న కారును పెట్టేందుకు వీరు సహకరించడంతోపాటు మన్‌సుఖ్‌ హత్యలో కూడా పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. 

సచిన్‌ వాజే పనిచేసిన బృందానికి నాయకుడిగా..

1990లో మహారాష్ట్ర పోలీసు విభాగంలో చేరిన సచిన్‌ వాజే తొలుత నక్సల్‌ ప్రభావిత గడ్చిరౌలిలో పనిచేశాడు. ఆ తర్వాత థానే పోలీస్‌ ప్టేషన్‌కు బదిలీ అయ్యాడు. అక్కడి నుంచి పెద్ద కేసులు దర్యాప్తు చేస్తూ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్నాడు. అప్పట్లో వాజే పనిచేసే బృందానికి ప్రదీప్‌ శర్మ నాయకత్వం వహించాడు. 

ఎవరీ ప్రదీప్‌ శర్మ..?

ప్రదీప్‌ శర్మ 1983లో పోలీసు ఉద్యోగంలో చేరాడు. నిఘా సమాచారం సేకరించడంలో ఆయన దిట్ట. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ఆయన్ను క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అక్కడి నుంచి అతని ఎన్‌కౌంటర్ల చరిత్ర మొదలైంది. అతని 25 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 100 మందిని ఎన్‌కౌంటర్‌ చేశాడు. పర్వేజ్‌ సిద్ధిఖీ, రఫీక్‌ డబ్బావాలా, సాదిక్‌ కాలియా వంటి గ్యాంగ్‌ స్టర్లు వీరిలో ఉన్నారు. 

లఖన్‌ భయ్యా ఎన్‌కౌంటర్‌తో ఆరోపణలు..!

2006లో లఖన్‌ భయ్యా తప్పుడు ఎన్‌కౌంటర్‌లో అతనిపై ఆరోపణలు వచ్చాయి. దావూద్‌తో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ప్రదీప్‌ శర్మ బృందం లఖన్‌ భయ్యాను అదుపులోకి తీసుకొన్న రోజే ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2008లో నేరగాళ్లతో సంబంధాలు, అవినీతి ఆరోపణలపై అతన్ని విధుల నుంచి తప్పించారు. లఖన్‌ భయ్యా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి 14 మంది పోలీసులతో సహా 22 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో శర్మ కూడా ఉన్నారు.   2013లో తప్పుడు ఎన్‌కౌంటర్‌ ఆరోపణలను కోర్టు కొట్టేసింది. కానీ, అతనికి సన్నిహితులైన 13 మంది అధికారులను నేరస్థులుగా పేర్కొంది. వీరిలో వినాయక్‌ షిండే అనే కానిస్టేబుల్‌ కూడా ఉన్నాడు. అదే షిండే తాజాగా అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో అరెస్టు అయ్యాడు. ప్రదీప్‌కు 2017లో మళ్లీ పోలీస్‌శాఖలో పోస్టింగ్‌ ఇచ్చారు. అదే ఏడాది దావూద్‌ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ను ప్రదీప్‌ శర్మ బృందం అరెస్టు చేసింది. అప్పటికి మళ్లీ పోస్టింగ్‌ తీసుకొని నెలరోజులే అవుతుంది. ప్రదీప్‌ శర్మ క్యారెక్టర్‌తో పలు బాలీవుడ్‌ చిత్రాలు రూపుదిద్దుకొన్నాయి.  

శివసేన తరపున ఎన్నికల్లో పోటీ..

ప్రదీప్‌ 2019లో పోలీస్‌ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి దిగాడు. శివసేన తరపున నల్లసోపర అసెంబ్లీ స్థానానికి టికెట్‌ సంపాదించి ఎన్నికల్లో పోటీచేశాడు. కానీ, ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు పీఎస్‌ ఫౌండేషన్‌ పేరుతో ఒక ఎన్‌జీవో నిర్వహిస్తున్నాడు. 

ముఖేశ్‌ అంబానీకి బెదిరింపులు, మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య తర్వాత కూడా సచిన్‌ వాజే తరచూ ప్రదీప్‌ను కలిసినట్లు దర్యాప్తులో తేలింది. ఆయన వాజేకు సాయం చేయడానికి ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. 

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts