Corona: కరోనా థర్డ్‌ వేవ్‌‌.. వచ్చే రెండు వారాలు కీలకం..!

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడో ముప్పు ముంగిట్లోనే

Published : 05 Jan 2022 12:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

‘‘ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చు. కేసులు అకస్మాత్తుగా, భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం, రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీనియర్‌ ఎపిడెమిలాజిస్ట్‌ గిరిధర్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం మధ్యలో కరోనా ఉద్ధృతి గరిష్ఠ స్థాయిలో ఉండొచ్చు’’ అని అంచనా వేశారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉందని అన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపడటంతో పాటు వ్యాక్సిన్లు కూడా వైరస్‌ ఉద్ధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు.

దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 58వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు 55శాతం పెరగడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్ర, దిల్లీలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించగా.. ముంబయిలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి సర్కారు భావిస్తోంది.

ఇదిలా ఉండగా.. నిబంధనలతోనే కరోనా మూడో దశ ఉద్ధృతిని అదుపులోకి తేవొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ ఆంక్షలతో పాటు, వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేస్తే కేసుల పెరుగుదలను అరికట్టవచ్చని అంటున్నారు.

‘దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కొవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని