Updated : 14 May 2021 11:08 IST

Fauci:డోసుల మధ్య వ్యవధి పెంపు సహేతుకమే

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ మరోసారి పలు విలువైన సూచనలు చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మహమ్మారి నియంత్రణలో అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించడాన్ని సమర్థించారు. కొవిడ్‌పై చేస్తున్న పోరులో అవసరమైతే మిలిటరీ సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవాలని హితవు పలికారు. 

దాని వల్ల ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదు...

సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని భారత ప్రభుత్వం 12-16 వారాలకు పొడిగించిన విషయం తెలిసిందే. దీన్ని ఫౌచీ సహేతుకమైన విధానంగా అభివర్ణించారు. వ్యాక్సిన్ల కొరత ఉన్నప్పుడు ఎక్కువ మందికి తొలి డోసు ఇవ్వడానికి ఇది సరైన నిర్ణయమని తెలిపారు. దీనివల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. పైగా వ్యాక్సిన్‌ సామర్థ్యం విషయంలో ఇది ప్రయోజనమే చేకూరుస్తుందని తెలిపారు. సరిపడా వ్యాక్సిన్లు లేక పోవడం వల్ల ఇలా కప్పిపుచ్చుకుంటున్నారన్న వాదనను ఫౌచీ తోసిపుచ్చడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఫౌచీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

స్పుత్నిక్‌-వి సమర్థమైనదేనని విన్నాను.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో ఆమోదం పొందిన మరో వ్యాక్సిన్‌ రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి. ఇప్పటికే భారత్‌ చేరుకున్న ఈ టీకా డోసులు వచ్చే వారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ టీకా సామర్థ్యంపై ఫౌచీ మాట్లాడుతూ.. ఇది దాదాపు 90 శాతం వరకు సామర్థ్యం కనబరిచినట్లు తాను విన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో టీకా మంచి ప్రభావమే చూపే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోందన్నారు.

ఇతర దేశాలతో సమన్వయం...

భారత్‌ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను సమకూర్చుకునే మార్గాలను అన్వేషించాలని ఫౌచీ సూచించారు. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటి వరకు తక్కువ శాతం మందికి మాత్రమే రెండు డోసులు అందాయని తెలిపారు. అలాగే సుమారు ఒక 10 శాతం మందికి ఒక డోసు అంది ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి వీలైనంత ఎక్కువ మందికి టీకాలు అందజేయాలన్నారు. అందుకోసం భారీ ఎత్తున టీకాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇతర దేశాలు, కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని హితవు పలికారు. భారత్‌ అతిపెద్ద టీకా తయారీ సామర్థ్యం ఉన్న దేశమని ఈ సందర్భంగా ఫౌచీ గుర్తుచేశారు. ఇప్పటికే వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో ధనిక దేశాలు కరోనాతో సతమవుతున్న దేశాలకు కరోనా కట్టడిలో సహకారం అందించాలని సూచించారు. ఇది నైతిక బాధ్యత అని గుర్తుచేశారు. 

సైన్యం సాయం తీసుకోండి...

ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు భారత్‌ తక్షణమే సైన్యం సహాయంతో క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను నిర్మించుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యుద్ధ సమయాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా సైన్యం సహకారంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా కచ్చితంగా ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన వారికి మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఫౌచీ వివరించారు.

ప్రయాణాల పునరుద్ధరణ కష్టమే...

భారత్‌లో వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత భారీ స్థాయిలో ఉందని ఫౌచీ తెలిపారు. ఈ సమయంలో భారత్‌-అమెరికా మధ్య ప్రయాణాలను పునరుద్ధరించడం కష్టసాధ్యం అని అభిప్రాయపడ్డారు. ఇక అమెరికా సరిహద్దుల్లో వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు మాత్రం తప్పనిసరి చేయబోమని స్పష్టం చేశారు. కొన్ని ఎయిర్‌లైన్స్‌ ఏదో రకమైన వైరస్‌రహిత ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరి చేయవచ్చని.. కానీ, అమెరికా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని