
మయన్మార్: సైనిక సంబంధ ఖాతాల తొలగింపు
ప్రకటించిన ఫేస్బుక్
యాంగూన్: మయన్మార్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొనడంతో అక్కడి సైనిక సంబంధిత ఖాతాలను తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 1న మయన్మార్లో సైనిక పాలన ప్రకటించినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై ఫేస్బుక్ తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తుండంటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు ఆ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మయన్మార్ మిలటరీకి చెందిన పలు ఖాతాలు, పేజీలను నిషేధించిన ఫేస్బుక్ తాజాగా అన్ని మిలటరీ సంబంధ ఖాతాలు, మిలటరీ ఆధ్వర్యంలో నడిచే సంస్థల ప్రకటనలు, ఇన్స్టాగ్రాం ఖాతాలను తొలగించింది. కొద్దిరోజుల క్రితం సైనిక పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన ఘటనలో మయన్మార్ మిలిటరీ అధికారిక పేజీని తొలగించినట్లు ఫేస్బుక్ గతంలో తెలిపింది.
మయన్మార్లో ఆన్లైన్ వేదికగా మిలిటరీ విద్వేష ప్రచారాల్ని నియంత్రించడంతో ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్వేష ప్రచారాల్ని అడ్డుకొనేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్బుక్ ఆ దేశంలోని పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేస్తోంది. 2017లో పలు మిలటరీ అధికారుల ఖాతాల్ని ఫేస్బుక్ తొలగించింది.
ఫిబ్రవరి 1న మయన్మార్లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న అనంతరం దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అనంతరం ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. కానీ ప్రజలు, రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు ఫేస్బుక్, ఇతర మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రాంలను నిషేధిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.