Facebook: ఆ టీకాలు వేసుకుంటే చింపాంజీలుగా మారతారు.. 300 ఖాతాలపై వేటు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న 300 ఖాతాలపై ఫేస్‌బుక్‌ వేటువేసింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వ్యాక్సిన్లు వేసుకుంటే చింపాంజీలుగా మారుతారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారి ఖాతాలను ఫేస్‌బుక్‌ నిలిపివేసింది....

Published : 14 Aug 2021 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న 300 ఖాతాలపై ఫేస్‌బుక్‌ వేటువేసింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వ్యాక్సిన్లు వేసుకుంటే చింపాంజీలుగా మారతారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారి ఖాతాలను ఫేస్‌బుక్‌ నిలిపివేసింది. వీరంతా రష్యాకు చెందిన ఖాతాదారులని.. భారతీయులు, లాటిన్‌ అమెరికా ఖాతాదారులే లక్ష్యంగా వారు ఈ పోస్టులు పెట్టినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుంటే మనుషులు చింపాజీలుగా మారతారని.. తర్వాత దీనికి మందు కూడా లేదని గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కొన్ని మీమ్స్‌, కామెంట్లు వైరల్‌గా మారాయి. ఈ ఏడాది మే నెలలో ఇలాంటి పోస్టులే కొన్ని వెలుగుచూశాయి. ఆస్ట్రాజెనెకాకు చెందిన కొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ పోస్టుల్లో వెలుగుచూశాయి.

‘చింపాంజీల జన్యువుల ఆధారంగా ఆస్ట్రాజెనెకా ఓ టీకాను తయారుచేసింది. దానిపై పరీక్షలు చేసినప్పుడు దుష్ప్రభావాలు  చూపించింది. ఈ వ్యాక్సిన్‌ను బహిష్కరించాలి. లేదంటే మనమంతా చింపాంజీలుగా మారతాం’ అంటూ కొన్ని పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ టీకాలపై దుష్ప్రచారానికి సంబంధించి గతేదాడి డిసెంబర్‌ నెల 14వ తేదీ నుంచి 21 తేదీ మధ్యలో దాదాపు 10వేల హాష్‌ట్యాగులు చేశారు.

ఈ దుష్ప్రచారాలపై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. ‘మా నిబంధనలు ఉల్లంఘించినందుకు 65 ఫేస్‌బుక్‌ ఖాతాలు, 243 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించాం. టీకాలపై దుష్ప్రచారాలు చేసేవారిని గుర్తించేందుకు మా బృందం తీవ్రంగా కృషిచేస్తోంది. వారి ఖాతాలను తొలగిస్తోంది’ అని ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని