Published : 02 Dec 2021 14:24 IST

Facebook: ఆ నకిలీ పోస్టు వెనుక చైనా హస్తం.. 500కిపైగా ఖాతాలు తొలగింపు!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మూలాల అన్వేషణలో అమెరికా జోక్యం చేసుకుంటోందని.. చైనాపై నింద మోపేలా పావులు కదుపుతోందని స్విట్జర్లాండ్‌కు చెందిన బయాలజిస్ట్‌ రాసినట్లు ఉన్న పోస్ట్‌ కొన్ని నెలల కిందట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చైనా మీడియా కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టుపై ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా దృష్టిసారించింది. దీని వెనుకున్న అసలు సూత్రదారులు చైనాకి చెందిన వారేనని గుర్తించింది. వారికి సంబంధించిన 500కుపైగా సోషల్‌మీడియా ఖాతాలను తొలగించింది. 

స్విట్జర్లాండ్‌కు చెందిన జీవశాస్త్రవేత్త విల్సన్‌ ఎడ్వర్డ్‌ పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలో కరోనా అంశంపై ఓ పోస్టు చేశారు. ‘కరోనా విషయంలో చైనాను నిందించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్‌-19 వైరస్‌ మూలాలను అన్వేషిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలపై అమెరికా ఒత్తిడి తెస్తోంది’అని పోస్టులో పేర్కొన్నారు. గత జులైలో పెట్టిన ఈ పోస్టు వైరల్‌ కావడంతో.. దీన్ని ఆధారంగా చేసుకొని చైనాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు కూడా కథనాలు రాసుకొచ్చాయి. కాగా.. విల్సన్‌ ఎడ్వర్డ్‌ అనే పేరుతో స్విట్జర్లాండ్‌లో జీవశాస్త్రవేత్తలు ఎవరూ లేరని, ఆ పేరుతో గతంలోనూ ఎలాంటి అకాడమిక్‌ కథనాలు వెలువడలేదని స్విస్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ ఫేస్‌బుక్‌ ఖాతాను ఇటీవలే ప్రారంభించారని పేర్కొంది. 

ఆ పోస్టుపై విచారణ జరిపిన మెటా సంస్థ.. వాస్తవాలను వెల్లడించింది. అది నకిలీ ఖాతా అని, చైనాకు చెందిన కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టును వైరల్‌ చేశారని తేల్చింది. ఈ కుట్రలో ‘సిచూవాన్‌ సైలెన్స్‌’ అనే ఐటీ కంపెనీ ఉద్యోగులతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా చైనాకు చెందిన మౌలిక సదుపాయాల సంస్థలతో సంబంధాలున్న మరికొందరు ఉన్నట్లు మెటా పేర్కొంది. సిచూవాన్‌ సంస్థ చైనా ప్రజాభద్రతకు, నేషనల్ కంప్యూటర్ నెట్‌వర్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు, సైబర్‌ సెక్యూరిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌కు సాంకేతిక సహకారం అందిస్తుండటం గమనార్హం.

విల్సన్‌ ఎడ్వర్డ్‌ పేరిట ఉన్న నకిలీ ఖాతా పోస్టును మొదట కొన్ని నకిలీ ఖాతాల ద్వారా షేర్‌ చేశారని, ఆ తర్వాత గుర్తింపు ఉన్న ఖాతాలతో వైరల్‌ చేశారని మెటా సంస్థ వెల్లడించింది. ఈ పనిచేసిన వారు ఐపీ అడ్రెస్‌ను గుర్తించకుండా వీపీఎన్‌ను ఉపయోగించినట్లు తెలిపింది. విల్సన్‌ ఎడ్వర్డ్‌ ప్రొఫైల్ ఫొటోని కూడా మెషిన్-లెర్నింగ్‌ను ఉపయోగించి తయారు చేసినట్లు మెటా భావిస్తోంది. ఈ నకిలీ పోస్టు వైరల్ అవడానికి కారణమైన మొత్తం 524 ఫేస్‌బుక్‌ ఖాతాలను, 20 పేజీలను, నాలుగు గ్రూపులను, 86 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించినట్లు మెటా సంస్థ వెల్లడించింది.

కరోనా మూలాలు చైనాలోనే ఉన్నాయని అమెరికా మొదటి నుంచి విమర్శలు చేస్తోంది. దీంతో చైనా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని