Updated : 27 May 2021 13:34 IST

Corona Manmade: వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్‌!

అలాంటి పోస్టులు తొలగించబోమని వెల్లడి

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసి ఏడాదిన్నర కావస్తున్నా.. వాటి మూలాలపై మాత్రం ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వుహాన్‌లోని ల్యాబ్‌నుంచి వైరస్‌ విడుదల అయ్యిందంటూ వస్తోన్న కథనాలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అవి అసత్య ప్రచారాలని పేర్కొంటూ.. ఎవరైనా వాటిని పోస్టు చేస్తే తొలగించే ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ అంశంపై తాజాగా వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్‌.. ఇకపై అలాంటి సమాచారాన్ని తొలగించబోమని వెల్లడించింది. వైరస్‌ మూలాలపై సమగ్ర విచారణ జరపాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారులను ఆదేశించడంతో పాటు వైరస్‌ను ‘మ్యాన్‌మేడ్‌’ అంటూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న తరుణంలో ఫేస్‌బుక్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘కరోనా వైరస్‌ మూలాలపై దర్యాప్తు జరుగుతోన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. ప్రజారోగ్య నిపుణులతో చర్చించిన అనంతరం మా విధానాన్ని మార్చుకున్నాం. కొవిడ్‌-19 మానవ సృష్టి అంటూ వచ్చే వార్తలను మా యాప్‌ల నుంచి తొలగించబోం’ అని ఓ అమెరికా వార్త పత్రికకు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరోనా మహమ్మారిపై వచ్చే వాస్తవాలు, నూతన సమాచారానికి అనుగుణంగా తమ విధానాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తామన్నారు. ఇందుకోసం ఆరోగ్య నిపుణులతో కలిసి పని చేస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు.

కొవిడ్‌ మూలాలపై నిగ్గు తేల్చండి: జో బైడెన్‌

కొవిడ్‌ మహమ్మారి మూలాలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని అమెరికా నిఘా సంస్థలను అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించారు. వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకిందా లేదా ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు బయటపడి ప్రపంచాన్ని చుట్టుముట్టిందా అనే అంశంలో అంతిమ నిర్ణయానికి వచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఆధారాలు సరిపోవడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలను కనుక్కునేందుకు అంతర్జాతీయ సమాజం నిర్వహించే పరిశోధనలో చైనా పాల్గొనడంతో పాటు పూర్తిస్థాయిలో సహకరించాలని, సమాచారాన్ని అందించడంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, ప్రపంచ విలయానికి కారణమైన కరోనా వైరస్‌ జంతువుల నుంచి మానవులకు సోకిందని ఇంకా నిరూపణ కాలేదు. ఈ  నేపథ్యంలో వైరస్‌ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌నుంచే వచ్చిందని ఎఫ్‌డీఏ మాజీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోందని అమెరికా మీడియా గుర్తుచేసింది. ఇక కరోనా మూలాలకు చైనానే కారణమంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు అప్పటి విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా ఆరోపణలు చేశారు. ఈ మహమ్మారికి చైనానే జవాబుదారీ వహించాలని పదేపదే పేర్కొన్న విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని