సాల్ట్‌తో ఉల్లిపాయ తింటే కరోనా రాదా? నిజమెంత? 

కరోనా వైరస్‌ జనారణ్యాల్లో ఉప్పెనలా విరుచుకుపడుతున్న వేళ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనే చిట్కాల ....

Published : 22 Apr 2021 21:38 IST

దిల్లీ: కరోనా వైరస్‌ జనారణ్యాల్లో ఉప్పెనలా విరుచుకుపడుతున్న వేళ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనేందుకు ఇంటి చిట్కాల పేరుతో సామాజిక మాధ్యమాల్లో అనేక సందేశాలు వైరల్‌ అవుతున్నాయి.  కరోనా వైరస్‌ అలజడి మొదలైనప్పటినుంచి రకరకాలుగా  ఫేక్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున సర్క్యులేట్‌ అవుతుండగా.. తాజాగా రాక్‌సాల్ట్‌తో ఉల్లిపాయ తింటే కరోనా నయమవుతుందంటూ వాట్సాప్‌లో ఓ ఆడియో సందేశం చక్కర్లు కొడుతోంది. అయితే, దీనికి కచ్చితమైన ఆధారాలేమీ లేవని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌విభాగం స్పష్టంచేసింది. ఇది అసత్య ప్రచారమేనని, ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని కొట్టిపారేసింది. ఏ అధ్యయనంలోనూ రాక్‌సాల్ట్‌తో ఉల్లిపాయ తింటే కరోనా నయమవుతుందని నిర్థారణ కాలేదని పేర్కొంది. ఇలాంటి నకిలీ సందేశాలను సర్క్యులేట్‌ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌తో కనీవినీ ఎగురని రీతిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్న వేళ ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయాలని  ప్రఖ్యాత వైద్యరంగ నిపుణులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే.

అలాగే, వేడినీటిలో నిమ్మకాయ, బేకింగ్ సోడా కలుపుకొని తాగితే తక్షణమే కరోనా వైరస్‌ చచ్చిపోతుందని, శరీరం నుంచి పూర్తిగా వైరస్‌ను తరిమికొడుతుందంటూ మరో సందేశం కూడా ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా అవాస్తవమని, దీంట్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని పీఐబీ కొట్టిపారేసింది.

మరోవైపు, విటమిన్‌ సి పుష్కలంగా లభించే ఉసిరి ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని, ఇలాంటి వాటిని రసం లేదా పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అనుభవజ్ఞులైన ఫిజీషియన్లతో పాటు అనేకమంది ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. తులసి కూడా శ్వాసకోశ ఇబ్బందుల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. తులసి ఆకులను నేరుగా తినొచ్చు లేదా హెర్బల్‌ టీ రూపంలోనైనా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. భారతీయ కిచెన్‌లలో అనునిత్యం వాడే పసుపు కూడా యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలను లక్షణాలను కలిగి ఉంటుందని, క్యాన్సర్‌, అల్జీమర్స్‌, గుండె జబ్బులను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇలా కాకుండా, తాజాగా రాక్ సాల్ట్‌తో ఉల్లిపాయ తినడం, వేడి నీటిలో నిమ్మకాయ, బేకింగ్ సోడా కలిపి తాగడంవల్ల కరోనా పోతుందంటూ వస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పీఐబీ తేల్చి చెప్పింది.Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts