Devendra Fadnavis: ఉద్ధవ్‌.. మీకు ఆ డైలాగ్‌లు సూట్‌ కావు..!

‘భాజపాతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే.. సీఎం పదవి కోసం తర్వాత మహావికాస్‌ అఘాడీతో కలిసిపోయారు. ఆయన మాకు నైతిక విలువల గురించి చెప్తున్నారా..?’అని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis)వ్యాఖ్యలు చేశారు.

Updated : 11 May 2023 19:55 IST

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) నైతికత గురించి మాట్లాడుతున్నారని, అసలు ఆ డైలాగ్ ఆయనకు సరిపోదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis) అన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

‘ఈ రోజు మహావికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది’ అని అన్నారు. అలాగే తీర్పు అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నైతిక బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఫడణవీస్ రాజీనామా చేయాలని ఉద్ధవ్‌ డిమాండ్ చేశారు. దీనిపై ఫడణవీస్‌ స్పందిస్తూ.. ‘వారికి(ఉద్ధవ్‌ వర్గాన్ని ఉద్దేశించి) నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. వారు భాజపాతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ తర్వాత కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. నైతిక విలువలు వంటి పదాలు ఉద్ధవ్‌కు సరిపోవు. నేను ఆయన్ను ఓ విషయం అడగాలనుకుంటున్నా. సీఎం పదవి కోసం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసినప్పుడు ఆ విలువలను మర్చిపోయారా..? గతంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతకాలం తనతో ఉన్నవ్యక్తులు వెళ్లిపోవడంతో భయపడి రాజీనామా చేశారు’ అని ఫడణవీస్‌(Devendra Fadnavis) విమర్శించారు.  

2022 జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటు నేతలు భాజపాతో చేతులు కలపడంతో శిందే ముఖ్యమంత్రి అయ్యారు. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను తిరిగి తిరిగి నియమించలేమని, ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది. అయితే ఈ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని