బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచి.. 200 కి.మీలు బస్సులో ప్రయాణం

Man travels bus with son's body: అంబులెన్స్‌కు డబ్బుల్లేక కన్నబిడ్డ మృతదేహాన్ని బస్సులో తీసుకెళ్లాడో తండ్రి. అది కూడా ఎవరికీ కనబడకుండా బ్యాగులో దాచుకుని 200కి.మీలు ప్రయాణించాడు.

Updated : 15 May 2023 11:07 IST

కోల్‌కతా: కన్నబిడ్డను కోల్పోయిన బాధ ఓవైపు.. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ (ambulance)కు డబ్బులివ్వలేని దీనస్థితి మరోవైపు..! నిస్సహాయ పరిస్థితుల్లో ఆ తండ్రికి మరో మార్గం కన్పించలేదు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని 5 నెలల తన కుమారుడి మృతదేహాన్ని తీసుకుని బస్సులో పయనమయ్యాడు. ఆ మృతదేహం ఎవరికీ కన్పించకుండా బ్యాగులో దాచుకుని 200 కి.మీలు ప్రయాణించాడు. ఈ అమానవీయ ఘటన పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ దినాజపూర్‌ జిల్లాలోని కలియాగంజ్‌ ప్రాంతానికి చెందిన అసిమ్‌ దేవశర్మ ఓ వలస కూలి. అతడికి ఐదు నెలల వయసున్న కవలపిల్లలు ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ అనారోగ్యానికి గురవడంతో కలియాగంజ్‌ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆ చిన్నారులను సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కవలల్లో ఒకరి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. దీంతో దేవశర్మ భార్య ఆ బిడ్డను తీసుకుని ఇంటికెళ్లింది. అయితే మరో కుమారుడు చికిత్స పొందుతూ గత శనివారం రాత్రి మృతిచెందాడు. (man travels in bus with son's body)

దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని దేవశర్మ ఆసుపత్రి సిబ్బందిని కోరారు. అయితే, ఇందుకు రూ.8వేలు చెల్లించాలని అంబులెన్స్‌ డ్రైవర్లు డిమాండ్‌ చేశారు. అయితే అప్పటికే చికిత్స నిమిత్తం రూ.16వేలు ఖర్చవ్వగా.. అంబులెన్స్‌కు ఇచ్చేందుకు అతడి దగ్గర డబ్బు లేదు. దీంతో చేసేదేం లేక చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచి 200కి.మీలు బస్సులో ప్రయాణించాడు. కలియాగంజ్‌ చేరుకున్నాక.. అక్కడి నుంచి అంబులెన్స్‌ మాట్లాడుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని అడిగాను. అయితే 102 పథకం కింద రోగులకు మాత్రం అంబులెన్స్‌ ఉచితమని, మృతదేహాలను తీసుకెళ్లేందుకు డబ్బులివ్వాల్సిందేనని డ్రైవర్లు చెప్పారు. రూ.8వేలు డిమాండ్‌ చేశారు. అంతమొత్తం లేకపోవడంతో బస్సులో వెళ్లాను. మృతదేహంతో ఎక్కుతానంటే ఇతర ప్రయాణికులు, బస్సులోని సిబ్బంది కిందకు దించేస్తారేమోనని భయపడ్డా. అందుకే ఎవరికీ తెలియకుండా బ్యాగులో తీసుకొచ్చా’’ అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్ష భాజపా నేత సువేందు అధికారి స్పందిస్తూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్వస్థ్య సాథి’ ఆరోగ్య పథకంపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి బెంగాల్ మోడల్‌ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. అయితే, ఈ విమర్శలను టీఎంసీ తిప్పికొట్టింది. భాజపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని