Tejashwi Yadav: నీతీశ్‌పై మండిపడ్డ తేజస్వీ యాదవ్‌

బిహార్‌లో 65శాతం రిజర్వేషన్లను పట్నా హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. సీఎం నీతీశ్‌ కుమార్‌పై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ మండిపడ్డారు. 

Published : 21 Jun 2024 00:17 IST

పట్నా: విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల (Reservations)ను 65 శాతానికి పెంచుతూ బిహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) నీతీశ్‌ సర్కార్‌పై మండిపడ్డారు. రిజర్వేషన్ల అమలు కోసం ప్రధాని మోదీ (PM Modi) ముందు మోకరిల్లండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘ రాష్ట్రం కోసం.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌ భాగంలో రిజర్వేషన్లను చేర్చమని కోరుతూ ప్రధాని వద్ద మరోసారి మోకరిల్లమని కోరుతున్నా. అలా చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఇతరులకు వీలు ఉండదు. ఆయన ఆ పని చేస్తే సమస్య పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’’ అని విలేకరుల సమావేశంలో తేజస్వీ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం..

‘‘భాజపా రిజర్వేషన్లకు వ్యతిరేకి. రిజర్వేషన్లను ఆపేందుకు తీవ్రంగా యత్నిస్తోందని మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఎన్నో సార్లు తెలిపాం. రాష్ట్రంలో కులగణన నిర్వహించినప్పుడు దానిని అడ్డుకునేందుకు భాజపా కోర్టులో పిల్‌ దాఖలు చేయడమే అందుకు నిదర్శనం. అయితే.. ఈ విషయంపై నీతీశ్‌ కుమార్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని తేజస్వీ ఆరోపించారు. అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించాలని కోరుతూ నీతీశ్‌కు లేఖ రాస్తానని.. తద్వారా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రధానితో చర్చించడానికి వీలవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.

65% రిజర్వేషన్లు రద్దు.. పట్నా హైకోర్టు సంచలన తీర్పు

కాగా.. గతేడాది బిహార్‌ ప్రభుత్వం కులగణనను నిర్వహించింది. ఆ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. దీనిపై అభ్యంతర వ్యక్తం చేసిన కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించడంతో నీతీశ్‌ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని