Covid Deaths: ఆ కొవిడ్‌ మరణాల నివేదికలు అవాస్తవం..!

దేశంలో అధికారంగా నమోదైన కొవిడ్‌ మరణాల కంటే వాస్తవంగా ఆ సంఖ్య ఎక్కువే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో వస్తోన్న కథనాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి తోసిపుచ్చింది.

Published : 18 Feb 2022 01:10 IST

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన

దిల్లీ: డెల్టా రకం కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో మొదలైన ‘సెకండ్‌ వేవ్‌’ ప్రభావంతో వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అధికారంగా నమోదైన కొవిడ్‌ మరణాల కంటే వాస్తవంగా ఆ సంఖ్య ఎక్కువే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు అంతర్జాతీయ నివేదికలు వెలుబడ్డాయి. మీడియాలో వస్తోన్న అటువంటి కథనాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి తోసిపుచ్చింది. ఆ నివేదికలన్నీ తప్పుదోవపట్టించే, అవాస్తవ కథనాలేనని స్పష్టం చేసింది.

‘‘దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారిక గణాంకాల కంటే వాస్తవంగా ఎక్కువగా ఉండవచ్చని మీడియాలో వస్తోన్న నివేదికలు తప్పుదోవపట్టించేవి. అవాస్తవం. అవన్నీ వాస్తవాల ఆధారంగా నివేదించినవి కావు. కేవలం ఊహాజనిత నివేదికలు మాత్రమే’ అని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 2021 నాటికే దేశంలో కొవిడ్‌-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 32 నుంచి 37లక్షల మధ్య ఉండవచ్చంటూ వచ్చిన ఆ నివేదికకు ఎటువంటి ఆధారం లేదని పేర్కొంది. కొవిడ్‌-19 మరణాలను నమోదు చేసేందుకు దేశంలో పకడ్బందీ వ్యవస్థ ఉన్నట్లు తెలిపింది. గ్రామపంచాయితీ స్థాయి నుంచి మొదలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రమం తప్పకుండా కొవిడ్‌ మరణాల నమోదుపై సమీక్ష జరుపుతూ వీటిని నమోదు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

‘అంతర్జాతీయంగా ఆమోద యోగ్యమైన నియమాల ఆధారంగానే ‘కొవిడ్‌-19 మరణం’ నిర్ధారణకు నిబంధనలు రూపొందించాం. దీనిని అమలు చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏమైనా కొవిడ్‌ మరణాలు నమోదు కానివి ఉంటే వాటిని వెంటనే అప్‌డేట్‌ చేయాలని రాష్ట్రాలకూ సూచించాం. కొవిడ్‌ మరణాల నమోదుకు సంబంధించి జిల్లా స్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాల్సిన అవసరాన్ని రాష్ట్రాలకు చెబుతూనే ఉన్నాం. అందుకే కొవిడ్‌ మరణాలు నమోదు చేయడం లేదంటూ వస్తోన్న నివేదికలకు ఎటువంటి ఆధారం లేదు. అవి సమర్థనీయం కావు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటనలో పేర్కొంది.

ఇదిలాఉంటే, దేశంలో ఇప్పటివరకు 5,10,413 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్‌ మరణాల రేటు 1.19శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని