‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్‌ మెసేజ్‌లు

ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ఆపరేషన్‌లో పాల్గొని ప్రాణాలు కోల్పోయారు కర్నల్ మన్‌ప్రీత్ సింగ్. ఆయన కుమారుడు ఇప్పటికీ తన తండ్రి జీవించే ఉన్నారనే అనుకుంటున్నాడు. 

Published : 18 Jun 2024 10:55 IST

దిల్లీ: దేశసేవలో నిమగ్నమై ఉన్నా.. తమకోసం పరిగెత్తుకొచ్చే తండ్రి ఎందుకు రావడం లేదో ఆ చిన్నారి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆయన ఇంకా విధుల్లోనే ఉన్నాడని, తాను పిలిస్తే వస్తాడనుకుంటున్నాడు. అందుకే సుమారు 9 నెలల క్రితమే అమరుడైన తన నాన్న కోసం.. వాయిస్ మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నాడు. ఆ చిన్నారికేం తెలుసు.. అవి తండ్రి వరకు చేరవని. తండ్రి కోసం ఆ తనయుడు పడుతోన్న ఆవేదన ప్రతిఒక్కరినీ మెలిపెడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు కర్నల్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ (Colonel Manpreet Singh) కమాండింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. అనంత్‌ నాగ్‌లోని కొకెన్‌నాగ్‌కు చెందిన గడోల్‌ అడవుల్లో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ లో చోటుచేసుకుంది. మన్‌ప్రీత్‌కు ఒక కుమారుడు, కుమార్తె. వారి ఎదుటే తండ్రి అంత్యక్రియలు జరిగినా.. ఆయన రాడనే విషయాన్ని వారు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆ పసి హృదయాలు తండ్రి కోసం తల్లడిల్లుతున్నాయి. ఏడేళ్ల కుమారుడు కబీర్‌.. ‘‘నాన్నా ఒకసారి ఇంటికి రా.. తర్వాత డ్యూటీకి వెళ్దువు కానీ’’ అంటూ మన్‌ప్రీత్‌ వాడిన నంబర్‌కు వాయిస్‌ మెసేజ్‌లు పంపుతున్నాడు. వీడియో కాల్‌ చేయమని అడుగుతున్నాడు. వాళ్ల అమ్మకు వినిపించకూడదని గుసగుసలాడుతూ వాటిని పంపిస్తున్నాడట. ఆ పిల్లాడి తపన నెట్టింట్లో వైరల్‌గా మారింది.

తన చర్యలు, విధుల ద్వారా అనంత్‌నాగ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మన్‌ప్రీత్‌సింగ్‌కు మంచిపేరు సంపాదించుకున్నారు. ఆయన అందించిన సహకారాన్ని స్థానికులు ఇప్పటికీ తలుచుకుంటున్నారు. పంజాబ్‌లోని తమ స్వస్థలంలో తన భర్త పిల్లల పేర్లతో రెండు మొక్కలు నాటాడని, అవి పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూడటానికి వెళ్దామని చెప్పాడని భార్య జగ్మీత్ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు.. అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చివరిసారిగా చేసిన కాల్‌ గురించి మాట్లాడుతూ.. తాను ఫోన్ చేసినప్పుడు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ఆపరేషన్‌లో ఉన్నానని చెప్పారన్నారు. అవే చివరి మాటలు అంటూ ఉద్వేగానికి గురయ్యారు.

ఇదిలాఉంటే.. సింగ్ అంత్యక్రియల సమయంలో చిన్నారి కబీర్‌ సైనికుడి దుస్తులు ధరించి తండ్రికి వీడ్కోలు పలికాడు. పక్కనే ఉన్న చెల్లి అన్నను అనుకరించింది. ఆ ఇద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. అప్పట్లో ఆ దృశ్యాలను చూసిన ప్రతీఒక్కరి మనసు బరువెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని