మేకకు సీమంతం.. వీడియో!

కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం కన్నకూతురి మాదిరిగా పెంచుకున్న ఓ మేకకు సీమంతం చేసింది. కన్నబిడ్డకు సీమంతం చేసినంత ఘనంగా ఈ వేడుక జరిపించి వార్తల్లో .......

Updated : 10 Mar 2021 20:08 IST

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం కన్నకూతురి మాదిరిగా పెంచుకున్న ఓ మేకకు సీమంతం చేసింది. కన్నబిడ్డకు సీమంతం చేసినంత ఘనంగా ఈ వేడుక జరిపించి వార్తల్లో నిలిచింది. మేకను అందంగా ముస్తాబు చేసి సీమంతం కార్యక్రమం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్రదుర్గ జిల్లా నన్నివాల గ్రామానికి చెందిన రాజు, గీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రంజిత తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమార్తె తమ మాట కాదని పెళ్లి చేసుకోవడంతో ఆ దంపతులు ఓ మేకను పెంచుకున్నారు. కన్నబిడ్డతో సమానంగా  దాన్ని చూసుకున్నారు.

అంతకముందు రాజు, గీత దంపతులు ఓ జింకను పెంచుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారడంతో దాన్ని అడవిలో వదిలిపెట్టారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న  జింకను అడవిలో వదలిపెట్టిన తర్వాత ఆ కుటుంబం మానసికంగా కుంగిపోయింది.  ఆ వేదన నుంచి బయట పడేందుకు తర్వాత వారు ఓ మేకను తెచ్చుకున్నారు. ఆ మూగజీవాన్ని తమ కుటుంబంలోని వ్యక్తిగా చూసుకున్నారు. ఇటీవల ఆ మేక గర్భం దాల్చింది. దాన్ని తమ పెద్ద బిడ్డగా భావించి గర్భందాల్చిన మేకకు సీమంతం జరపాలని నిర్ణయించుకున్నారు.

ఈ  పెంపుడు మేక సీమంతం వేడుకకు ఆ దంపతులు తమ బంధువులందరినీ ఆహ్వానించారు. ఆడబిడ్డకు నిర్వహించే సీమంతం వేడుకకు ఏమాత్రం తీసిపోని విధంగా మేక సీమంతం జరిపారు. ఆ మూగ జీవంపై రాజు-గీత దంపతులు చూపించిన అనుబంధాన్ని చూసి ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోయారు. బంధాలు, అనుబంధాలను పూర్తిగా ఆర్థిక సంబంధాలతో  ముడిపెడుతున్న ఈ రోజుల్లో డబ్బు ఖర్చుచేసి మేకకు సీమంతం నిర్వహించిన ఆ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని