Shashi Tharoor: ‘మీ అందం సీక్రెట్‌ చెప్పండి సర్‌’: యువతి ప్రశ్న.. థరూర్‌ ఆసక్తికర జవాబు

నాగాలాండ్‌ పర్యటనలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor)కు ఓ మహిళా అభిమాని నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటీ? థరూర్‌ ఏం చెప్పారు..?

Published : 06 Mar 2023 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ (Congress) ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) మరోసారి వార్తల్లో నిలిచారు.  ఆయన చాలా అందంగా ఉంటారని కొనియాడిన ఓ మహిళా అభిమాని.. అందుకు సీక్రెట్ ఎంటో చెప్పాలంటూ థరూర్‌ను అడిగింది. దీనికి కాంగ్రెస్‌ నేత చెప్పిన సమాధానం నవ్వులు పూయించింది. ఈ ఆసక్తికర సంభాషణ నాగాలాండ్‌ పర్యటనలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

శశి థరూర్‌ (Shashi Tharoor) ఇటీవల నాగాలాండ్‌ (Nagaland) రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ జరిగిన ‘లంగ్‌లెంగ్‌ షో’ అనే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ యువతి మాట్లాడుతూ థరూర్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగింది. ‘‘సర్.. నేను మీకు పెద్ద అభిమానిని. అయితే ఈ విషయం చెప్పండి. ఎవరైనా చాలా అందంగా, ఆకర్షణీయంగా కన్పిస్తూ అదే సమయంలో చాలా తెలివైన వ్యక్తిగా ఎలా ఉండగలుగుతారు? మీ రహస్యమేంటో కాస్త చెప్పండి సర్‌’’ అని ఆ యువతి ప్రశ్నించింది.

దీనికి థరూర్‌ (Shashi Tharoor) స్పందిస్తూ.. ‘‘కొన్ని విషయాల్లో మనమేం చేయలేం. మరికొన్నింటిని మనం మార్చలేం. అందం గురించి నిజాయతీగా ఒక మాట చెప్పాలంటే.. మీ తల్లిదండ్రులను మీరు తెలివిగా ఎంచుకోండి. వారసత్వంలోనే అంతా ఉంటుంది’’ అంటూ సరదాగా బదులిచ్చారు. ఆ వెంటనే తెలివి గురించి మాట్లాడుతూ.. ‘‘దీనికి మన శ్రమ కూడా అవసరం. చదవడం అనేది మన జీవితానికి చాలా ముఖ్యం. అది చిన్నతనం నుంచే అలవాటుగా మారాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు చదివాను. అందులోని ఎన్నో విషయాలను గుర్తుంచుకున్నాను. సాధన చేస్తే ఏదీ అసాధ్యం కాదు. ఇంట్లో ఉండి అద్దం ముందు ప్రాక్టీస్‌ చేస్తే సరిపోదు. బయట ప్రేక్షకుల మధ్యకు వెళ్లి వాళ్ల స్పందన గుర్తించాలి. అప్పుడే మనం మనల్ని మెరుగుపర్చుకోగలం’’ అంటూ థరూర్‌ సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని