venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా సాగింది. అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకున్నారు.......

Published : 08 Aug 2022 21:19 IST

దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా సాగింది. అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ వెంకయ్య ప్రతిక్షణం ప్రజా జీవితంలోనే ఉన్నారని కొనియాడారు. ఆయన విధివిధానాలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే గౌరవం అన్నారు. సభలో ఏ పక్షం ఎలా ఆలోచిస్తుందో వెంకయ్యనాయుడికి ముందే తెలిసిపోతుందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమగ్ర సమాచారంతో ఉంటారని పేర్కొన్నారు. అధికార, విపక్షాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండేలా చూశారని కొనియాడారు.

వెంకయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో నాకు, వెంకయ్యకు మధ్య చర్చలు జరిగేవి. మంత్రిత్వ శాఖల విషయంలో ప్రధానిదే తుది నిర్ణయం. ఎవరికి ఏ శాఖ అప్పగించాలనే విషయమై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. కానీ, వెంకయ్యను ఏం శాఖ కావాలని అడగ్గా.. గ్రామీణాభివృద్ధి శాఖ కావాలని ఆయన అన్నారు. గ్రామాలను, దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పమే ఇందుకు కారణం. ఆ శాఖను ఆయన విజయవంతంగా నిర్వహించారు కూడా’ అని మోదీ నాటి విషయాలను గుర్తుచేశారు. ప్రధాని మాట్లాడుతున్న సమయంలో వెంకయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

మోదీ ప్రసంగం అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి పదవిని ఉద్దేశిస్తూ పార్టీ, ప్రధాని అందరూ నాకు గురుతర బాధ్యత కట్టబెట్టారని అన్నారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా నా విధిని ఉత్తమంగా నిర్వర్తించానని భావిస్తున్నానని పేర్కొన్నారు.  చిన్నప్పుడే తల్లిని కోల్పోయానని, ఆ బాధ మినహా జీవితంలో మరే ఇతర లోటు లేదన్నారు. ఏం కావాలనుకున్నానో అది చేశానని, కొన్ని పదవులు వాటంతట అవే వచ్చాయని అన్నారు.

దేశంపై భక్తితో ఉండాలని, అసలైన దేశభక్తి అంటే ఏంటో ఈ సందర్భంగా వివరించారు. గురజాడ అప్పారావు చెప్పిన నినాదం ‘దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌’ను తెలుగులో వినిపించారు. ప్రజలను మంచిగా చూసుకున్నప్పుడే మనం నిజమైన దేశభక్తులం అవుతావన్నారు. కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా అందరిని ఒకేలా చూడాలని పిలుపునిచ్చారు. భారతీయ జీవన విధానం, కుటుంబ వ్యవస్థ మనకు ఇచ్చిన గొప్ప సంపద అని.. దాన్ని కాపాడుకోవాలన్నారు.

అందరికి స్ఫూర్తిగా నిలిచారు

అంతకుముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ వివిధ హోదాల్లో వెంకయ్యనాయుడు విశేష సేవలందించారన్నారు. ‘ఆయన ఏ పదవిలో ఉన్నా అందరికి స్ఫూర్తిగా నిలిచారు. రాజ్యసభలో 19 ఏళ్లపాటు ఆదర్శనీయమైన ఎంపీగా ఉన్నారు. ప్రజా జీవితం నుంచి ఆయనకు ఎప్పుడూ విరామం ఉండదు. రాజ్యసభను క్రమశిక్షణగా నడిచేలా కృషి చేశారు’ అని అన్నారు. ఖర్గేతోపాటు పలువురు మంత్రులు ఆయన చేసిన సేవలను గుర్తుకుచేసుకున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని