Viral news: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్సై ఏం చేశాడో చూడండి!

డబ్బులకు కక్కుర్తి పడిన ఓ ఎస్సై లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు దొరికిపోయాడు. వారి నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 14 Dec 2022 01:57 IST

ఫరీదాబాద్: నేరస్థులను పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీస్‌  ఆఫీసర్‌(Police) ఆయన. డబ్బుకి కక్కుర్తి పడి లంచం (Bribe) తీసుకున్నాడు. విజిలెన్స్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వారి నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఈ ఘటన హరియాణా(Haryana)లోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సుభ్నత్‌ అనే వ్యక్తి తన గేదెను దొంగలించారంటూ ఫిర్యాదు చేసేందుకు ఇటీవల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. న్యాయం జరగాలంటే రూ.10 వేలు ఇవ్వాలంటూ ఫరీదాబాద్‌ ఎస్సై మహేంద్ర ఉలా డిమాండ్‌ చేశాడు. సుభ్నత్‌ ఇప్పటికే రూ.6 వేలు ఇవ్వగా.. మరో రూ.4 వేలు ఇస్తేనే కేసును టేకప్‌ చేస్తానని ఎస్సై షరతు విధించాడు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి డబ్బులు ఇస్తుండగా విజిలెన్స్‌ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆధారాలు లేకుండా చేయాలని.. ఎస్సై ఆ నోట్లను మింగేసేందుకు యత్నించాడు. అతడిని బలవంతంగా రోడ్డుపై పడుకోబెట్టిన అధికారులు.. నోట్లో చెయ్యిపెట్టి డబ్బులను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈలోగా మరో వ్యక్తి ఎస్సైపై చేయి చేసుకున్నాడు. అతడిని విజిలెన్స్ అధికారులు వారించి అక్కడి నుంచి పంపేశారు. ఆ తర్వాత ఎస్సైని తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ తతంగాన్నంతా అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో బంధించారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని