అకౌంట్‌ నుంచి రూ.8 లక్షలు మాయం.. తిరిగి వెనక్కి ఎలా వచ్చాయంటే!

ఓ రైతు ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు (Cyber Fraudsters) దాదాపు రూ.8 లక్షలకు పైగా మొత్తాన్ని దోచుకున్నారు. అయితే, అతడితోపాటు కుమారుడు అప్రమత్తంగా వ్యవహరించడంతో దాదాపు మొత్తం సొమ్ము రికవరీ అయ్యింది.

Updated : 19 Feb 2023 20:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్లు (Cyber Fraudsters) ఇతరుల ఖాతాల్లోకి అక్రమంగా చొరబడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. అప్రమత్తమైన కొందరు ఆ మొత్తాన్ని తిరిగి పొందుతుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని ఓ రైతు సైబర్‌ నేరగాళ్లకు చిక్కుకున్నాడు. దాదాపు రూ.8 లక్షల నగదును దుండగులు దోచుకున్నారు. అయితే, చాకచక్యంగా వ్యవహరించిన రైతు (Farmer), అతడి కుమారుడు దాదాపు మొత్తం నగదును తిరిగి రాబట్టుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన 55 ఏళ్ల పవన్‌కుమార్‌ సోనీకి 26 ఏళ్ల హర్షవర్ధన్‌ అనే కుమారుడు ఉన్నాడు. దిల్లీలోని ద్వారకలో చదువుకుంటున్నాడు. శ్రీగంగానగర్‌లోని  తండ్రి బ్యాంకు ఖాతా హర్షవర్ధన్‌ ఫోన్‌ నంబర్‌తోనే రిజిస్టరై ఉంది. జనవరి 7న హర్షవర్ధన్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ‘మీ బ్యాంకు అకౌంట్‌ బ్లాక్‌ అయ్యింది. వెంటనే కేవైసీ అప్‌డేట్‌ చేసుకోండి’ అని దాని సారాంశం. అప్పటికే ఎస్‌బీఐ యోనో యాప్‌ వాడుతున్న హర్షవర్దన్‌.. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే మరో డూప్లికేట్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిపోయింది. అందులో అప్‌డేట్‌ చేయాలేమో అనుకొని.. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేశాడు. వెంటనే.. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ అవుతున్నట్లు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. సైబర్‌ నేరగాళ్లను తన మొబైల్‌ను హ్యాక్‌ చేసి డబ్బులు దోచుకుంటున్నారని తెలుసుకునే లోపే..తన తండ్రి ఖాతా నుంచి రూ.8,03,899 డెబిట్‌ అయిపోయాయి. వ్యవసాయ ఖర్చుల కోసం బ్యాంకు నుంచి తండ్రి అప్పు తీసుకున్న డబ్బులవి.

బ్యాంకులో ఫిర్యాదు చేసి..

వెంటనే శ్రీగంగానగర్‌లో ఉంటున్న తన తండ్రికి హర్షవర్ధన్‌ ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. పరుగుపరుగున వెళ్లి అతడు బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మరోవైపు హర్షవర్ధన్‌ కూడా ద్వారకలోని సైబర్‌ సెల్‌ అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. పవన్‌కుమార్‌ సోనీ ఖాతాను బ్యాంకు మేనేజర్‌ పరిశీలించగా.. నగదు మొత్తం మూడు ఖాతాల్లోకి బదిలీ అయినట్లు తేలింది.  పేయూ ఖాతాలోకి మొదటిసారి రూ.5 లక్షలు, మరోసారి రూ.1.24లక్షలు బదిలీ కాగా, రూ.1.54 లక్షలు సీసీఅవెన్యూ ఖాతాలోకి బదిలీ అయ్యింది. మిగతా రూ.25వేలు యాక్సిస్‌ బ్యాంకు ఖాతాలో చేరినట్లు అధికారులు గుర్తించారు. పేయూ, సీసీఅవెన్యూలు డిజిటల్‌ పేమెంట్‌ సంస్థలు. ఇవి వినియోగదారులకు, వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటాయి. వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసినప్పుడు డిజిటల్‌ పేమెంట్‌ రూపంలో నగదును సేకరించి, వ్యాపారుల ఖాతాల్లోకి జమ చేస్తాయి.

రూ.6.24 లక్షల రికవరీ

పవన్‌కుమార్‌ సోనీ నుంచి ఫిర్యాదు సేకరించిన వెంటనే బ్యాంకు మేనేజర్‌ పేయూ సంస్థకు మెయిల్‌ పంపారు. ఆ మెయిల్‌కు స్పందించిన పేయూ తమ ఖాతాల్లో జమ అయిన నగదును తాత్కాలికంగా స్తంభింపజేసినట్లు రిప్లై ఇచ్చింది. రెండు రోజుల్లోగా సైబర్‌ క్రైం పోలీసుల నుంచి మెయిల్‌ రాకపోతే నగదును వ్యాపారి ఖాతాలోకి రిలీజ్‌ చేస్తామని తెలిపింది. మరోవైపు సీసీఅవెన్యూ సంస్థకూడా సానుకూలంగా స్పందించింది. బ్యాంకుతోపాటు స్థానిక సైబర్‌ సెల్‌లోనూ ఫిర్యాదు చేయడంతో.. సైబర్‌ క్రైం అధికారుల ఆదేశాల మేరకు పేయూ రూ.6.24 లక్షలను తిరిగి రైతు ఖాతాలో జమచేసింది.  మరోవైపు సీసీ అవెన్యూ ఖాతాలో జమఅయిన రూ.1.54 లక్షల్లో దాదాపు రూ.1.20 లక్షల నగదును సైబర్‌ నేరగాళ్లు కోల్‌కతాలోని ఓ జియో స్టోర్‌లో ఖర్చు పెట్టేశారు. దీనిపై హర్షవర్ధన్‌ కోల్‌కతా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. దిల్లీ పోలీసుల నుంచి రాతపూర్వకంగా సమాచారం అందేంత వరకు ఈ కేసులో ఏమీ చేయలేమని పేర్కొన్నారు.

ఎన్నోసార్లు పోలీసుల చుట్టూ తిరిగిన తర్వాత చివరికి జనవరి 23న ద్వారక పోలీసులు యాక్సిస్‌ బ్యాంకు, సీసీ అవెన్యూలో జమ అయిన నగదుపై ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు సత్వరం స్పందించి.. మిగతా డబ్బును కూడా తిరిగి ఇప్పించాలని హర్షవర్ధన్‌ వేడుకుంటున్నాడు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లకు స్పందించి తనలా మోసపోవద్దని చెబుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని