స్వయం సమృద్ధి భారత్‌లో రైతులది కీలక పాత్ర

దేశ వ్యవసాయ రంగాన్ని రైతులు రోజురోజుకీ మరింత బలోపేతం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. స్వయం సమృద్ధి భారత్‌ లక్ష్య సాధనలో కర్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కొవిడ్‌-19 సంక్షోభ కాలంలో మన దేశ వ్యవసాయ రంగ శక్తి ఎంటో తెలిసిందన్నారు..........

Updated : 27 Sep 2020 13:18 IST

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ: దేశ వ్యవసాయ రంగాన్ని రైతులు రోజురోజుకీ మరింత బలోపేతం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. స్వయం సమృద్ధి భారత్‌ లక్ష్య సాధనలో కర్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కొవిడ్‌-19 సంక్షోభ కాలంలో మన దేశ వ్యవసాయ రంగ శక్తి ఎంటో తెలిసిందన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం జరిగే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రధాని తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ రంగ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రసంగంలో ప్రధానంగా రైతు సమస్యలపై దృష్టి సారించారు. రైతుల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. 

కొన్ని రాష్ట్రాల్లో ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ చట్టం(ఏపీఎంసీ)’ నుంచి పండ్లు, కూరగాయల్ని మినహాయించిన తర్వాత రైతులు భారీ ఎత్తున లాభపడ్డారని ప్రధాని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విజయం సాధించిన రైతుల గాథలను గుర్తుచేసిన మోదీ.. సాగుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన ఆర్థికతత్వ ప్రాముఖ్యాన్ని మనం గతంలోనే గుర్తించి ఉంటే ఇప్పుడు స్వయం సమృద్ధి నినాదం అవసరం ఉండేది కాదని వ్యాఖ్యానించారు. భారత్‌ ఎప్పుడో ఆ లక్ష్యాన్ని చేరుకునేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

భారతీయ సంస్కృతిలో కథలు చెప్పడానికి ఉన్న ప్రాధాన్యాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాగరికతతో పాటే కథలు చెప్పే సంస్కృతి కూడా విస్తృతమైందన్నారు. మన దేశంలో శతాబ్దాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోందన్నారు. శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన కథలు ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ‘బెంగళూరు స్టోరీటెల్లింగ్‌ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. ప్రతి కుటుంబం నేటి నుంచి కొంత సమయాన్ని కథలు చెప్పడానికి కేటాయించాలని కోరారు. ఈ సంస్కృతి మన జీవితాల్లో అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు