Long march: మహా పాదయాత్ర విరమణ.. స్వగ్రామాలకు రైతులు

Farmers Long march: మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతో మహా పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతులు ప్రకటించారు.

Updated : 18 Mar 2023 21:55 IST

ముంబయి: మహారాష్ట్ర నాసిక్‌ జిల్లా నుంచి ముంబయి వరకు రైతులు తలపెట్టిన మహా పాదయాత్రను (Long March) విరమించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని... స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు తెలిపారు. ఈ మేరకు యాత్రకు నేతృత్వం వహిస్తున్న సీపీఎం ఎమ్మెల్యే వినోద్‌ నికోలె ప్రకటించారు. దీంతో రైతులు  స్వగ్రామాలకు పయనమైనట్లు కూడా తెలిపారు.

ఉల్లి రైతులకు క్వింటాకు రూ.600 చొప్పున ఆర్థిక సాయం, రుణ మాఫీ డిమాండ్లతో దిందోరి పట్టణం నుంచి ముంబయికి రైతులు మార్చి 12న పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారానికి ఆరో రోజుకు చేరింది. ఈ క్రమంలో మహా పాదయాత్ర చేపట్టిన రైతుల డిమాండ్లకు అంగీకరిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీలో ప్రకటించారు.

ధరల పతనం, అకాల వర్షాలతో నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాకు రూ.350 తక్షణ ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. డిమాండ్లు అంగీకరించినందుకు యాత్రను విరమించాలని రైతులను కోరారు. దీంతో పాదయాత్రను విరమించినట్లు వినోద్‌ తెలిపారు. శని, ఆదివారం నాటికి రైతులు తమ ఇళ్లకు చేరుకుంటారని వినోద్‌ నికోలె చెప్పారు.

మరోవైపు మహా పాదయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నాసిక్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 58 ఏళ్ల అంబో జాదవ్‌ అనే శుక్రవారం రాత్రి మృతి చెందారు. రాత్రి 8 గంటల సమయంలో భోజన అనంతరం జాదవ్‌ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు