Farm laws: సిర్సా వీధుల్లో ఉద్రిక్తత

హరియాణాలోని సిర్సాలో రహదారులు రణరంగాన్ని తలపించాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లను నెట్టుకుంటూ నిరసన కారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశద్రోహం పేరిట అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు...

Published : 17 Jul 2021 23:40 IST

సిర్సా: హరియాణాలోని సిర్సాలో రహదారులు రణరంగాన్ని తలపించాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లను నెట్టుకుంటూ నిరసన కారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశద్రోహం పేరిట అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు పారామిలటరీ దళాల సాయం తీసుకోవాల్సి వచ్చింది.

జులై 11న భాజపా నేత, హరియాణా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రణ్‌బీర్‌ గంగ్వా కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 100 మంది రైతులపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. గురువారం వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి వారిని విడుదల చేయాలంటూ మిగతా రైతులు ఇవాళ ఆందోళనకు దిగారు. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతం దిల్లీకి కేవలం 240 కి.మీ మాత్రమే ఉండటంతో రాజధానిలోనూ హైఅలెర్ట్‌ ప్రకటించారు. రైతులను విడుదల చేయకపోతే నిరసనకారులు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆందోళనలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ కూడా పాల్గొనే అవకాశముంది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిర్సా రోడ్డులో ఆందోళన చేపడుతున్న రైతులు ఆదివారం అటువైపుగా వెళ్తున్న డిప్యూటీ స్పీకర్‌ రణ్‌బీర్‌ గంగ్వా వాహనంపై దాడికి యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు 100 మందిపై దేశద్రోహం కేసుతోపాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను రైతుల ఆందోళనలకు మద్దతిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్రంగా ఖండించింది. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించింది. దీనిపై కోర్టులో సవాల్‌ చేస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని