Farmers Protest: రైతుల ఉద్యమానికి అతి త్వరలో ముగింపు..!

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతన్నలు.. ఎట్టకేలకు ఉద్యమాన్ని ముగించేందుకు సిద్ధమైనట్లు

Updated : 07 Dec 2021 20:33 IST

దిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతన్నలు.. ఎట్టకేలకు ఉద్యమాన్ని ముగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో అతి త్వరలోనే రైతులు ఉద్యమాన్ని విరమించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

అన్నదాతల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మూడు సాగు చట్టాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గత నెల ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ రైతులకు క్షమాపణలు కూడా తెలిపారు. ఉద్యమాన్ని విరమించి అన్నదాతలు  వెళ్లిపోవాలని కోరారు. అయితే చట్టాల ఉపసంహరణ జరిగినప్పటికీ.. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించే హామీ సహా ఇతర అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. 

దీనిపై ఇటీవల కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే కనీస మద్దతు ధర చట్టబద్ధతపై కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంతేగాక, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తామని కూడా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అందుకు సంబంధించి రైతు సంఘాల నేతలకు తాజాగా ప్రభుత్వం లేఖలు పంపింది. ఈ లేఖలపై రైతు సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యమాన్ని విరమించే అంశంపై రైతు సంఘాలు బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని