‘ఆ నలుగురూ సాగు చట్టాల్ని సమర్థించినవారే..’ 

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్టేని స్వాగతించిన.....

Updated : 12 Jan 2021 20:33 IST

‘సుప్రీం’ కమిటీని తిరస్కరించిన రైతు సంఘాల నేతలు

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చట్టాల నిలుపుదలను స్వాగతించిన రైతు సంఘాల నేతలు కమిటీని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రైతు సంఘాల నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీని విశ్వసించబోమని, ఆ కమిటీ ముందు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

ఈ కమిటీలో సభ్యులు ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులని, సాగుచట్టాలకు అనుకూలంగా వ్యాసాలు కూడా రాశారని ఆరోపించారు. చట్టాలపై స్టే వచ్చినప్పటికీ తమ ఆందోళన యథాతథంగా కొనసాగుతుందన్నారు. కొత్త సాగు చట్టాల అమలుపై స్టే విధించడం మంచి విషయమేనన్నారు. ఈ చట్టాలను రద్దుచేసే దాకా దేనికీ తాము అంగీకరించబోమన్నారు. 

ఈ నెల 26న తలపెట్టిన నిరసన కార్యక్రమం ప్రణాళికపై ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి శాంతియుతంగానే నిర్వహిస్తామన్నారు. ఎర్రకోట, పార్లమెంట్‌ వద్దకు రైతులు వెళ్తారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రైతులు తెలిపారు. 26న గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టబోయే మార్చ్‌ ఎలా ఉండాలో జనవరి 15న నిర్ణయిస్తామని తెలిపారు. హింసను తామెప్పుడూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.

సాగు చట్టాలపై సుప్రీం స్టే.. 11 పేజీల తీర్పు 
కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు 11 పేజీల తీర్పును వెలువరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భూపేంద్రసింగ్‌, ప్రమోద్‌కుమార్‌, అశోక్‌ గులాటి, అనిల్‌ ఘన్వత్‌ ఉన్నారు. 10 రోజుల్లో పని ప్రారంభించాలని కమిటీని ఆదేశించింది. కమిటీ పర్యటన, ఇతర ఖర్చులను కేంద్రమే భరించాలని సూచించింది. రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు సేకరించాలని కమిటీని ఆదేశించింది. ప్రభుత్వ ప్రతినిధులు, భాగస్వామ్యపక్షాల అభిప్రాయం తీసుకోవాలని సూచించింది. ఈ కమిటీ 2 నెల్లలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను 8 వారాల తర్వాత చేపడతామని తెలిపింది.

ఇదీ చదవండి..

నూతన సాగు చట్టాల అమలుపై స్టే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని