The Kashmir Files: అది ప్రచారం కోసం తీసిన చిత్రమే : ఫరూక్‌ అబ్దుల్లా

ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంపై జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు.

Published : 23 Mar 2022 01:43 IST

నాటి విషాదం ఇంకా బాధిస్తోందన్న జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం

దిల్లీ: కశ్మీర్‌ పండిట్‌ల వృత్తాంతంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలు రాష్ట్రాలు ఈ చిత్రాన్ని చూడాలని ప్రోత్సహిస్తుండగా.. మరికొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంపై జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు. ఇది కేవలం ‘ప్రచారం’ కోసం తీసిన చిత్రమేనన్న ఆయన.. నాటి ఘటనకు తాను బాధ్యుడనని రుజువైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనన్నారు. తాజాగా ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా ఈ విధంగా స్పందించారు.

ఇది కేవలం ప్రచారం కోసం తీసిన చిత్రం. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా నాటి ఘటన ప్రతిఒక్కరిలో విషాదాన్ని నింపింది. ఆనాటి విషాదంపై ఇప్పటికీ నా హృదయం మండిపోతూనే ఉంది’ అని ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూక్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే, కశ్మీర్‌ పండిట్‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పటికీ తాను ఎటువంటి చర్యలు తీసుకోలేదని వస్తోన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కశ్మీరీ పండిట్‌లు భారీగా వలస వెళ్లే సమయంలో.. నాటి గవర్నర్‌రే వారిని బస్సుల్లో ఎక్కించారని గుర్తుచేశారు.

‘నాటి ఘటనపై న్యాయవిచారణ లేదా కమిటీ వేస్తే వాస్తవాలు బయటపడుతాయి. అందుకు ఎవరు బాధ్యులో కూడా తెలుస్తుంది. ఒకవేళ నేను ( ఫరూక్‌ అబ్దుల్లా ) బాధ్యుడని రుజువైతే దేశంలో ఎక్కడైనా ప్రాణత్యాగానికి సిద్ధమే’ అని ఫరూక్‌ అబ్దుల్లా ఉద్ఘాటించారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే అప్పట్లో నిఘా విభాగాధిపతిగా ఉన్న వ్యక్తులతో కానీ, అప్పట్లో కేంద్రమంత్రి, ప్రస్తుత కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ ముహమ్మద్‌ వంటి వారిని అడిగి తెలుసుకోవాలని సూచించారు.

అవన్నీ అవాస్తవాలే

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంలో పూర్తిగా అవాస్తవాలనే చూపించారని ఫరూక్‌ అబ్దుల్లా కుమారుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. ‘‘1990లో కేంద్రంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధికారంలో ఉన్నట్లు చూపించారు. కానీ, ఆ సమయంలో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన ఉంది. అలాగే కేంద్రంలో భాజపా మద్దతు ఉన్న వీపీ సింగ్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు మరణించిన, వలస వెళ్లిన వారిలో కశ్మీర్‌ పండిట్లే కాదు.. ముస్లింలు, సిక్కులు కూడా ఉన్నారు. వారెవరూ ఇప్పటికీ కశ్మీర్‌కు తిరిగి రాలేదు’’ అని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్‌ పండిట్లను తిరిగి తీసుకొచ్చేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్ తనవంతు ప్రయత్నం చేస్తోందని ఒమర్‌ అబ్దుల్లా ఇటీవల వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని