FCRA: సీపీఆర్‌కు షాక్‌.. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసిన కేంద్రం

సీపీఆర్‌ సంస్థ విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడిందని.. అందువల్లే ఆ సంస్థ FCRA లైసెన్సును రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు.

Published : 02 Mar 2023 00:48 IST

దిల్లీ: దేశంలో ప్రఖ్యాత మేధోమథన పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చి(CPR)కు కేంద్రం షాక్‌ ఇచ్చింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA) కింద ఆ సంస్థ లైసెన్సును కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఎఫ్‌సీఆర్‌ఏలో నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను లైసెన్సును సస్పెండ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ సంస్థ విదేశీ దాతల నుంచి విరాళాలను పొందే అవకాశం కోల్పోనుంది. గతేడాది సెప్టెంబర్‌లో సీపీఆర్‌, ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థలపై ఐటీశాఖ సర్వేల తర్వాత దీన్ని పరిశీలనలో ఉంచారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంటూ తాజాగా సీపీఆర్‌కు విదేశీ విరాళాలు పొందే లైసెన్సును రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. గతేడాది జనవరిలో ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును రద్దు చేయగా.. ఆ ఎన్‌జీవో కేంద్ర హోంశాఖలో రివిజన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. 

1973 నుంచి భారత్‌లో పరిశోధనలు చేస్తోన్న సీపీఆర్‌ సంస్థకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, వర్లడ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, డ్యూక్‌ యూనివర్సిటీ దాతలుగా ఉన్నాయి. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ. దీనికి కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ గుర్తింపు పొందిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసెర్చి నుంచి కూడా గ్రాంట్‌లు వస్తుంటాయి. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సులను రద్దు చేయడం ద్వారా సీపీఆర్‌కు ఎలాంటి విదేశీ నిధులూ రావు. అయితే, విదేశాల నుంచి అందుకున్న నిధులకు సంబంధించిన పత్రాలతో పాటు స్పష్టత ఇవ్వాలని కోరినట్టు అధికారులు తెలిపారు. సీపీఆర్‌కు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ గతంలో 2016లో పునరుద్ధరణ కాగా.. 2021లో పునరుద్ధరణకు ఇంకా గడువు ఉంది. 21వ శతాబ్దంలో భారత్‌కు ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విధానసంబంధిత  అంశాలపై లోతైన పరిశోధనలు చేసి ఈ సంస్థ నివేదికలు తయారుచేస్తుంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని