Nana Patole: కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్‌ నేత

మహారాష్ట్ర (Maharashtra) కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు నానా పటోలే ఓ వివాదంలో చిక్కుకున్నారు. 

Updated : 18 Jun 2024 18:58 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు నానా పటోలే (Nana Patole) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన బురద కాళ్లతో కారులో కూర్చొని ఉండగా ఓ పార్టీ కార్యకర్త ఆయన కాళ్లను కడుగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వివాదాస్పదంగా మారింది. దీంతో పలువురు నెటిజన్లు, భాజపా నాయకులు ఆయన తీరును విమర్శిస్తున్నారు. 

భాజపా(BJP) నేత షెహజాద్ పూనావాలా(Shehzad Poonawalla) ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులది నవాబీ, ఫ్యూడల్‌ మనస్తత్వం అని దుయ్యబట్టారు. ‘‘మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే పార్టీ కార్యకర్తతో కాళ్ళు కడిగించుకుంటున్నారు... వారు ఓటర్లను, కార్యకర్తలను బానిసల్లాగా చూస్తారు. తాము రాజులమనుకుంటారు. అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్‌ నేతలు ఇలా ప్రవర్తిస్తే ఒక వేళ అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటారో ఆలోచించండి’’ అని రాసుకొచ్చారు. ఈ విధంగా చేసినందుకు నానా పటోలే, కాంగ్రెస్‌ పార్టీ ఆ కార్యకర్తకు క్షమాపణలు చెప్పాలని పూనావాలా డిమాండ్‌ చేశారు. 

భాజపా నేత శాంతి కుమార్(Shanti Kumar) ఎక్స్‌ ఖాతా వేదికగా స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థానంలో ఉన్నా కూడా తన పాదాలను ఎవరినీ తాకనివ్వరన్నారు. వారికి విరుద్ధంగా కాంగ్రెస్‌ నాయకులు ఇతరులతో కాళ్లు కడిగించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో బానిసత్వ ఆలోచనలు గాంధీల కుటుంబంతో మొదలై పార్టీ మొత్తానికి విస్తరించాయని మండిపడ్డారు.

వీడియోపై కాంగ్రెస్‌ నేత నానా పటోలే స్పందిస్తూ ‘‘ఓ సభకు వెళ్లినప్పుడు నా కాళ్లకు బురద అంటుకుంది. ఓ కార్యకర్తను నీళ్లు తీసుకురమ్మంటే తీసుకువచ్చాడు. అతడు నీళ్లు పోస్తుంటే కాళ్లు కడుక్కున్నాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. బురదలో తిరగడం నాకు కొత్త కాదు. ఇలాంటి ఆరోపణలతో బాధపడట్లేదు... మీలో కూడా కొందరు నాయకులు పార్టీ కార్యకర్తలతో తలకు, కాళ్ళకు మసాజ్ చేయించుకుంటున్నారు... వారి వీడియోలు ఎందుకు చూపించట్లేదు? ఏదేమైనా నాకు పబ్లిసిటీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి 31 సీట్లు గెలుచుకోగా, భాజపా పరాజయం ఎదుర్కొంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని