Monkeypox: భారత్‌లో మరో రెండు మంకీపాక్స్‌ కేసులు నమోదు

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ (Monkeypox) వైరస్‌ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ లక్షణాలతో మొన్ననే కేరళలో ఒకరు మృతిచెందగా......

Updated : 02 Aug 2022 17:55 IST

కేరళ, దిల్లీలో కొత్త కేసులు 

దిల్లీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ (Monkeypox) వైరస్‌ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. ఈ ఒక్కరోజే మరో రెండు కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. మంకీపాక్స్‌ లక్షణాలతో మొన్ననే కేరళలో ఒకరు మృతిచెందగా.. కొత్తగా అక్కడ మరో వ్యక్తి(30 ఏళ్లు)లో ఈ వైరస్‌ లక్షణాలు వెలుగుచూశాయి. జులై 27న యూఏఈ నుంచి కాలికట్‌ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్‌ వెల్లడించారు. మలప్పురంలోని ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నామని.. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. అతడితో సన్నిహితంగా తిరిగిన కుటుంబ సభ్యులు, స్నేహితులను మానిటరింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. తాజాగా నమోదైన కేసుతో కేరళలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 5కి చేరింది.

మరోవైపు,  మంకీపాక్స్‌ లక్షణాలతో కేరళలో 22 ఏళ్ల వ్యక్తి మృతిచెందడంతో త్రిస్సూరు జిల్లాలో 20 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. అతడు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి మొత్తం 10 మందితో మాత్రమే కాంటాక్టు అయ్యాడన్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

దిల్లీలో మూడుకి చేరిన కేసులు..

దేశ రాజధాని నగరంలో కొత్తగా మరొకరికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ వెల్లడించారు. విదేశీ పౌరుడైన 35 ఏళ్ల వ్యక్తికి దిల్లీలో మంకీపాక్స్‌ పాజిటివ్‌ వచ్చిందని..  ఇటీవలి కాలంలో అతడికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని రాజ్యసభలో వెల్లడించారు. తాజా కేసుతో కలిపి దిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీపాక్స్‌ కేసుల సంఖ్య మూడుకు చేరగా.. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ బాధితుల సంఖ్య 8కి చేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని