
వీధిపోరాటాన్ని తలపించిన హోండరస్ చట్టసభ
తెగుసిగల్పా: సెంట్రల్ అమెరికా దేశమైన హోండరస్ జాతీయ కాంగ్రెస్ (చట్టసభ) శుక్రవారం వీధిపోరాటాన్ని తలపించింది. కొందరు సభ్యులు పెద్దగా అరుస్తూ పోడియం ఎక్కి కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పడి తోసుకుంటూ కొట్టుకున్నారు. కొద్ది రోజుల్లో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న జివోమారా క్యాస్ట్రోకు చెందిన లిబ్రే పార్టీ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం క్రమేపీ పెద్దదై ఈ ఘర్షణకు దారితీసింది. గత ఏడాది నవంబరులో ఎన్నికలు జరిగిన తర్వాత హోండరస్ కాంగ్రెస్ తొలిసారి సమావేశమైంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా తమలో ఒకరైన జార్జ్ కాలిక్స్ పేరును లిబ్రే పార్టీ అసమ్మతివాదులు 20 మంది ప్రతిపాదించడంతో వివాదం మొదలైంది. దీన్ని పార్టీ మిగతా సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. లిబ్రే సంకీర్ణ భాగస్వామ్య ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని క్యాస్ట్రో మద్దతుదారులు ధ్వజమెత్తారు. కాలిక్స్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో.. ‘ద్రోహులు’ అంటూ కేకలు పెడుతూ క్యాస్ట్రో మద్దతుదారులు ఆగ్రహంతో పోడియంపైకి ఎక్కి అవతలికి దూకి కాలిక్స్ను నెట్టేసి ఆయనపై దాడికి దిగారు.
దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అవినీతి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలతో చేతులు కలుపుతున్నారన్న ఆరోపణలతో తమ పార్టీకి చెందిన 20 మందిని క్యాస్ట్రో పార్టీ నుంచి బహిష్కరించారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షస్థానానికి గాను తమ సంకీర్ణ భాగస్వామి అయిన సేవియర్ పార్టీ ఆఫ్ హోండరస్ (పీఎస్హెచ్)కి చెందిన లూయిస్ రెడోండోకు మద్దతివ్వాలని కోరేందుకు క్యాస్ట్రో సమావేశం నిర్వహించగా 20 మంది అసమ్మతివాదులు హాజరు కాలేదు. దీంతోనే వివాదం తలెత్తింది. కాగా క్యాస్ట్రో ఈనెల 27న అధ్యక్షురాలిగా బాధ్యతలు
చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు.