Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్‌ ఇచ్చిన సలహా

కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి వైరం కోరుకోవడం లేదని.. మోదీ (Narendra Modi) తమకు మద్దతిస్తే, తమనుంచి వారికి పూర్తి మద్దతు ఉంటుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  (Kejriwal) పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 02:58 IST

దిల్లీ: బడ్జెట్‌ను (Budget) ప్రవేశపెట్టకుండా కేంద్రం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) ఆరోపించారు. కేవలం దురుద్దేశంతోనే ఇటువంటి చర్యలకు దిగిందన్న ఆయన.. ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను అడ్డుకోలేదన్నారు. బడ్జెట్‌ను అర్థం చేసుకోలేని కొందరు నిరక్షరాస్యులకు చూపించే బదులు అర్థం చేసుకునే వారికి ఇస్తే బాగుండేదంటూ భాజపా నేతలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏదేమైనా.. కేంద్రంతో తమకు ఎటువంటి వైరం లేదని.. ప్రధాని తమకు మద్దతు ఇస్తే అదే విధమైన మద్దతు తమనుంచి వారికి లభిస్తుందని అరవింద్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) వెల్లడించారు.

దిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన కేజ్రీవాల్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎటువంటి గొడవలు లేకుంటే దిల్లీలో అభివృద్ధి మరో 10రెట్లు అధికంగా ఉండేదని అన్నారు. ‘నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ, కేంద్రం దాన్ని అడ్డుకుంది. ఎటువంటి మార్పులు చేయకుండానే కేంద్ర హోంశాఖకు బదులిచ్చాం. అనంతరం వాళ్లు దానికి ఆమోదం తెలిపారు. వాళ్లముందు నేను తలొగ్గాలని వారి కోరిక. ఇది కేవలం వారి అహం మాత్రమే. అంతకన్నా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. జగడం వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం ఉండదు. గొడవలు కోరుకోవడం లేదు. ప్రధానితో కలిసి చేయాలని అనుకుంటున్నాం. దిల్లీలో గెలవాలని మోదీ కోరుకుంటే.. ముందు నగర ప్రజల మనసులను గెలుచుకోవాలి. ఇదే ఆయనకు నేను చెప్పే మంత్రం’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

మరోవైపు దిల్లీ ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో ప్రకటనల కోసం కేటాయించిన మొత్తం అధికంగా ఉండటం, ఇతర మౌలిక సదుపాయాల కోసం తక్కువగా ఉందని పేర్కొంటూ హోంశాఖ అభ్యంతరం తెలిపినట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. వీటికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కోరగా.. ఆప్‌ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు కేంద్ర హోం శాఖ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని