Shashi Tharoor: ‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్‌ సెటైర్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Published : 06 Jul 2024 12:11 IST

దిల్లీ: భారతీయ జనతా పార్టీ(BJP)ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్(Shashi Tharoor) చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 370కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 400లకు పైగా సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ(PM Modi) తన ప్రచారాల్లో తరచుగా చెప్పేవారు. కానీ ఫలితాల్లో 293 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గురువారం బ్రిటన్‌(Britain) పార్లమెంటులో లేబర్‌ పార్టీ(Labour Party) 400లకు పైగా సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ రెండు దేశాల్లోని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి శశి థరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరలైంది. ఇందులో ఆయన ‘‘ఎట్టకేలకు ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌ (ఈసారి 400లకు పైగా)’ సాధ్యమైంది. కానీ.. కానీ వేరే దేశంలో’’ అంటూ భాజపాపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 240 సీట్లు సాధించగా, ఎన్డీఏ కూటమి 293 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్‌కు ఒంటరిగా 99 సీట్లు రాగా ఇండియా కూటమి 234 సీట్లు సాధించింది. అనంతరం ఇద్దరు స్వతంత్ర ఎంపీలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో సీట్ల సంఖ్య 236కి చేరుకుంది.

బ్రిటన్‌ ఎన్నికల్లో స్టార్మర్‌ నాయకత్వంలోని లేబర్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్‌ ఐర్లాండ్‌ వ్యాప్తంగా గల 650 స్థానాలకు గాను 33.7 శాతం ఓట్లతో 412 సీట్లు దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 201 స్థానాలకే పరిమితమైంది. రిషి సునాక్‌ (44) నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ 121 సీట్ల దగ్గర ఆగిపోయింది. మెజారిటీకి 326 సీట్లు అవసరం. దీంతో బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్‌ పార్టీ అధ్యక్షుడు కీర్‌ స్టార్మర్‌ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని