Excise Duty: ఇంధన ధరలు తగ్గింపు.. ఆ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే

పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో భాగంగా ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా పడే భారాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు.

Published : 23 May 2022 01:37 IST

క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో భాగంగా ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా పడే భారాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావం పడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి స్పష్టత ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ట్వీట్‌ చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకంలో బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (BED), స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (SAED), రోడ్‌& ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ (RIC)తోపాటు అగ్రికల్చర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ (AIDC) కలిపి ఉంటాయి. తాజాగా తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీ రాష్ట్రాలతో పంచుకునేది కాదు. దీన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. కేవలం బీఈడీ మాత్రమే రాష్ట్రాలతో పంచుకోబడుతుంది. SAED, RIC, AIDC లు పంచుకోవు. కావున రాష్ట్రాలపై ప్రభావం చూపించదు’ అని కేంద్ర మంత్రి వివరించారు.

ఇదిలాఉంటే, నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసే ప్రయత్నంలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వచ్చింది. అయితే, ఇలా ఎక్సైజ్‌ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని కోరిన నిర్మలా సీతారామన్‌.. ఎక్సైజ్‌ సుంకం కోత వల్ల కోల్పోయే పూర్తి ఆదాయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని