ICC World Cup: వరల్డ్‌ కప్‌ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌పై (ICC World Cup 2023).. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు.

Updated : 29 Sep 2023 15:20 IST

అహ్మదాబాద్‌: కెనడా-భారత్‌ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) వరుస హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో భారత్‌ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్‌ కప్‌పైనా (ICC World Cup 2023).. ఈ ఉగ్రవాది కన్ను పడినట్లు తెలుస్తోంది. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను ‘వరల్డ్‌ టెర్రర్‌ కప్‌’గా మారుస్తానంటూ చేసిన హెచ్చరికలు సంచలనం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గుజరాత్‌ పోలీసులు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అక్టోబర్‌ 5న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్‌ కప్‌ 2023 (Cricket World Cup) తొలి మ్యాచ్‌ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌తో పాటు ఇక్కడ పలు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) సంస్థ చీఫ్‌, ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల హత్యకు గురైన నిజ్జర్‌కు ప్రతీకారంగా కెనడా నుంచి కొందరు ఖలీస్థాన్‌ మద్దతుదారులు భారత్‌కు చేరుకున్నారంటూ చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించి గురుపత్వంత్‌ సింగ్‌ మాట్లాడినట్లు ఉన్న ప్రీ-రికార్డింగ్‌ ఆడియో కాల్‌ దేశవ్యాప్తంగా ఎంతో మందికి వచ్చింది. ఈ విషయాన్ని పలువురు గుజరాత్‌ వ్యక్తులు స్థానిక పోలీసులకు తెలియజేశారు.

Khalistani ఉగ్ర కుట్రలు.. మాస్టర్‌ మైండ్‌ ‘పన్నూ’..!

తాజా పరిణామాలతో గుజరాత్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపులకు పాల్పడిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైం డీసీపీ అజిత్‌ రాజియన్‌ పేర్కొన్నారు. మరోవైపు, కెనడాలోని హిందువులు భారత్‌కు వెళ్లిపోవాల్సిందేనంటూ గురుపత్వంత్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో కెనడాలో ఉన్న భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయినప్పటికీ పన్నూపై జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని