విరాట్‌ కోహ్లీకి చెందిన వన్‌8 కమ్యూన్‌ పబ్‌పై పోలీసు కేసు

నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి దాటిన తర్వాత నడుపుతున్న పబ్‌లపై బెంగళూరు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి చెందిన పబ్‌ కూడా ఉంది. 

Published : 09 Jul 2024 12:11 IST

బెంగళూరు: స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి చెందిన పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా దానిని నిర్వహిస్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కోహ్లికి చెందిన వన్‌8 కమ్యూన్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాటినుంచి పెద్దశబ్దంతో సంగీతం వినిపిస్తోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకే వాటికి అనుమతి ఉన్నప్పటికీ, ఆ తర్వాత కూడా నిర్వాహకులు వాటిని తెరిచే ఉంచినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ‘‘దీనిపై మేం దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటాం’’ అని వెల్లడించారు. ప్రస్తుతం వన్‌8 కమ్యూన్‌ మేనేజర్‌పై కేసు నమోదైంది.

ఇతర మెట్రో సిటీలైన దిల్లీ, ముంబయి, పుణె, కోల్‌కతాలో కూడా వన్‌8 కమ్యూన్‌ బ్రాంచ్‌లు ఉన్నాయి. బెంగళూరు పబ్‌ను గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు. కస్తూర్బా రోడ్డులో ఉన్న దీని నుంచి సమీపంలో ఉన్న కబ్బన్‌ పార్క్‌, చిన్నస్వామి స్టేడియంలను వీక్షించొచ్చట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని