కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: 8మంది మృతి

అహ్మదాబాద్‌ నవరంగ్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది...

Updated : 06 Aug 2020 11:09 IST

అహ్మదాబాద్‌ : కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఘోరం జరిగింది. గుజరాత్ ‌రాష్ట్రం అహ్మదాబాద్‌లోని శ్రేయ కొవిడ్‌ ఆసుపత్రి ఐసీయూ వార్డులో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కొవిడ్‌ ఆసుపత్రిలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని సిబ్బంది, రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం నుంచి 40 మంది రోగులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు.

ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం సహాయనిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని