
South Africa: దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోడలకు పగుళ్లు!
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పార్లమెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటం, పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే పనిలో నిమగ్నమయ్యారు. ‘నేషనల్ అసెంబ్లీ భవనం అగ్నికీలల్లో చిక్కుకుంది. పైకప్పునకు మంటలు వ్యాపించాయి’ అని కేప్‌టౌన్ నగర అత్యవసర సేవల ప్రతినిధి ఒకరు.. ఓ వార్తాసంస్థకు చెప్పారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని.. ఇప్పటికే వాటి ధాటికి గోడలకు పగుళ్లు వచ్చాయని తెలిపారు. మంటల నియంత్రణకు మరికొంతమంది అగ్నిమాపక సిబ్బంది అవసరమన్నారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
కేప్ టౌన్‌లోని ఈ పార్లమెంట్ భవన ప్రాంగణంలో మూడు విభాగాలు ఉన్నాయి. ఇందులో అత్యంత పురాతన భవనం 1884లో నిర్మితమైంది. అనంతరం 1920, 1980ల్లో మరో రెండింటిని కట్టారు. నేషనల్ అసెంబ్లీ ఇందులో ఒకటి. గత ఏడాది ఏప్రిల్‌లోనూ కేప్ టౌన్ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో అగ్నిప్రమాదం సంభవించి.. ఆఫ్రికన్ చరిత్రకు సంబంధించిన అరుదైన సేకరణలు మంటల్లో కాలిపోయాయి.