భారత్‌-చైనా బలగాల మధ్య కాల్పులు!

గల్వాన్‌ వ్యాలీలో ఇటీవల భారత్‌- చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం మరిచిపోకముందే మళ్లీ ఇరుదేశాల మధ్య కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌, చైనా బలగాల మధ్య

Updated : 08 Sep 2020 07:48 IST

దిల్లీ: గతకొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్‌-చైనా సరిహద్దుల్లో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, తొలుత భారతే కాల్పులు జరిపిందంటూ చైనా పశ్చిమ థియేటర్‌ కమాండర్‌ బుకాయించే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిస్పందనగానే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ తొలి నుంచి అనుసరిస్తున్న తమ దురుసు వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై భారత సైన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల తూర్పు లద్దాఖ్‌, పాంగాంగ్‌ సరస్సు సమీపంలో కీలక పర్వత ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు యత్నించింది. చైనా కుట్రలను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం.. వారి కంటే ముందే కీలక పర్వత ప్రాంతాల్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో వివాదాస్పద ప్రాంతంలోని కీలక స్థావరాలన్నీ భారత్‌ గుప్పిట్లోకి వచ్చాయని సమాచారం. అయితే, ఎక్కడా భారత్‌ నిబంధనల్ని ఉల్లఘించలేదు. వాస్తవాధీన రేఖను అతిక్రమించలేదు. ఎల్‌ఏసీకి భారత్‌ వైపున్న ప్రాంతాలపైనే పట్టు సాధించింది. తాజాగా సోమవారం రాత్రి మరో కీలక ప్రాంతమైన షెన్‌పావో పర్వతంపై కూడా భారత్‌ పట్టు బిగించినట్లు తెలుస్తోంది. దీంతో దుర్బుద్ధితో ముందుకు సాగుతున్న చైనా కదలికలపై నిఘా వేసే అవకాశం లభించింది. 

దీన్ని జీర్ణించుకోలేకపోయిన డ్రాగన్.. భారత్‌ పట్టు సాధించిన ప్రాంతాలపై డ్రోన్‌తో నిఘా వేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీన్ని గుర్తించిన భారత సైన్యం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. చైనా తన ఆగడాలను కట్టిపెట్టలేదని సమాచారం. ఈ నేపథ్యంలో గట్టిగా హెచ్చరించడంలో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. భారత సైన్యం తాజా ఘటన, చైనా ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని