Jammu and Kashmir: మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్‌

రాజౌరి జిల్లాలోని మంజకోట్ ఆర్మీ క్యాంపు సమీపంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

Published : 07 Jul 2024 15:16 IST

రాజౌరి: జమ్మూకశ్మీర్‌లో రాజౌరి వద్ద మంజకోట్ ఆర్మీ క్యాంపు(Manjakote army camp) సమీపంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ సైనికుడు గాయపడినట్లుగా ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటికే కుల్గాం జిల్లాలో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. వీటిల్లో  ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు సైనికులు కూడా అమరులయ్యారు. శనివారం సైనిక బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్లు ప్రారంభమై.. ఇప్పటికీ కొనసాతున్నాయి. 

కుల్గాం జిల్లాలోని మోడెర్‌గాం, ఫ్రిజల్‌ ప్రాంతాల్లో ఉగ్రకదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో శనివారం భద్రతా బలగాలు ఆపరేషన్లు చేపట్టాయి. మోడెర్‌గాం గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్లు తెలుసుకున్న సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ జవాన్లు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన ఉగ్రవాదులు ఎదురు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఓ జవాన్‌.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం భద్రతా దళాలు ఆ ఇంటిని ధ్వంసం చేశాయి. ఓ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి.

ఇక కుల్గాంలోని ఫ్రిజల్‌ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. సుదీర్ఘ సమయం చోటు చేసుకొన్న కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జవాన్‌ మరణించారు. ఘటనా స్థలంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని