Indian Navy: ‘అగ్నిపథ్‌’ మొదటి బ్యాచ్‌.. 20 శాతం వరకు మహిళలే..!

సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కింద ఇప్పటికే త్రివిధ దళాలల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

Updated : 22 Aug 2022 16:43 IST

దిల్లీ: సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కింద ఇప్పటికే త్రివిధ దళాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ పథకం కింద మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కనుందని తెలుస్తోంది. నావికా దళంలో దీనికింద మొదటి బ్యాచ్‌లో 20 శాతం మంది వరకు మహిళలు ఉంటారని భారత నేవీ అధికారులు మీడియాకు వెల్లడించారు. నావికా దళం ప్రకటించిన అర్హతలను వారు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వారిని ఈ దళంలో వేర్వేరు శాఖలకు కేటాయించనున్నారు. ఈ ఏడాది 3000 మంది అగ్నివీరులను నియమించుకోవాలని భావిస్తున్నామని, ఇందులో మహిళలు కూడా ఉంటారని ఇటీవల నేవీ ప్రకటించింది. 

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ నియామకాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద వాయుసేనలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవ్వగా.. దాదాపు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 1 నుంచి నేవీ, ఆర్మీల్లోనూ ఈ పథకం కింద నియామక ప్రక్రియ మొదలైంది. కాగా.. అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారి నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. అవసరమైతే వారిని యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్లు పేర్కొంది.

త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కింద 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల వయసు కలిగిన యువతను కేంద్రం అర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాదికి మాత్రం గరిష్ఠ పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. కాగా, ఈ పథకం కింద నియమితులైన వారు నాలుగేళ్ల సర్వీసుపై పనిచేయాల్సి ఉంటుంది. వీరిలో 25శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన మళ్లీ సర్వీసులోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని