Agniveers: ఐఎన్‌ఎస్‌ చిల్కాలో తొలి బ్యాచ్‌ అగ్నివీర్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌.. త్వరలోనే విధుల్లోకి

తొలిసారిగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా తొలి బ్యాచ్‌ అగ్నివీర్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ విజయవంతంగా ముగిసింది. నాలుగు నెలల శిక్షణ పూర్తిచేసుకున్న 2,585 మంది అగ్నివీర్‌లు యుద్ధనౌకల్లో విధులు నిర్వహించనున్నారు.  

Updated : 29 Mar 2023 05:44 IST

చిలికా: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా తొలి బ్యాచ్‌ అగ్నివీర్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 2,585 మంది నౌకాదళ అగ్నివీర్‌లు నాలుగు నెలల కఠోర శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లోకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ హాజరయ్యారు. రాజ్యసభ ఎంపీ పీటీ ఉష, మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ సైతం ఈ చరిత్రాత్మక పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్మిరల్‌ హరికుమార్‌ మాట్లాడుతూ.. నేర్చుకోవాలనే సంకల్పం, నిబద్ధత, జ్ఞాన సముపార్జన కోసం బలమైన పునాదులు వేసుకోవాలని అగ్నివీర్‌లకు సూచించారు. జాతి నిర్మాణ సాధనలో భాగంగా నేవీ ప్రధాన విలువలైన విధి, గౌరవం, ధైర్యసాహసాలను ప్రదర్శించాలన్నారు. 

పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ను సాధారణంగా ఉదయం వేళలో నిర్వహిస్తున్నప్పటికీ ఈసారి సాయంత్రం వేళ నిర్వహించారు. తొలి బ్యాచ్‌లో 272 మహిళా అగ్నివీర్‌లు సైతం తమ శిక్షణను పూర్తిచేసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సులో శిక్షణ పొందిన ఈ నౌకాదళ అగ్నివీర్‌లు ఫ్రంట్‌లైన్‌ యుద్ధనౌకల్లో విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు