Cheetahs: 24 గంటల్లోనే నమీబియా చీతాల తొలివేట..!

నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఫ్రెడ్డీ, ఎల్టోన్‌ అనే రెండిటిని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు.

Updated : 08 Nov 2022 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఫ్రెడ్డీ, ఎల్టోన్‌ అనే రెండిటిని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. దీనిలోకి వెళ్లిన 24 గంటల్లోనే ఇవి తొలి వేటను పూర్తిచేశాయి. తొలుత ఈ చీతాల కండరాలు క్వారంటైన్లో బలహీనపడి ఉంటాయని అధికారులు ఆందోళన చెందారు. కానీ, ఇవి రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇవి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయంలోగా ఓ మచ్చల జింకను వేటాడినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

మొత్తం 8 చీతాలను నమీబియా  నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌ తీసుకొచ్చారు. వీటిని దాదాపు 50 రోజులపాటు క్వారంటైన్‌ చేశారు. అనంతరం వీటిల్లో రెండిటిని  పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. తాము ఊహించిన దానికంటే చాలా వేగంగా తొలివేటను పూర్తి చేసుకొన్నాయని అధికారులు వెల్లడించారు. శాటిలైట్‌ కాలర్స్‌, ఎన్‌క్లోజర్‌లోని కెమెరాలతో వీటి కదలికలను గమనిస్తున్నారు. మిగిలిన ఐదు చీతాలను కూడా త్వరలోనే పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి పంపే అవశాలున్నాయి. వీటిల్లో ఆశా అనే చీతా గర్భంతో ఉన్నట్లు భావిస్తున్నారు. 

దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి తీసుకొచ్చారు.  వీటి తరలించేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విమానం బి747 జంబోజెట్‌ను వినియోగించారు. అయిదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కునో పార్కులోకి విడిచిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని