Lok Sabha: సభా సమయం

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో ఘట్టం ప్రారంభం కాబోతోంది. 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి.

Published : 24 Jun 2024 05:13 IST

నేటి నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు
స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా?

ఈనాడు, దిల్లీ: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో ఘట్టం ప్రారంభం కాబోతోంది. 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. జులై 3 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో- నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం, నూతన స్పీకర్‌ ఎంపిక, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం, తర్వాత ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వంటివి ఉంటాయి. గత రెండు పర్యాయాలు సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన భాజపా- ఇప్పుడు ఎన్డీయే మిత్రపక్షాల బలంతో ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ స్పీకర్‌ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ వాతావరణాన్ని బట్టి ఓం బిర్లానే మరోసారి కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పదవి కోసం వేర్వేరు పేర్లు వినిపించినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం ఆయన కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బిర్లాకు సంకేతం కూడా అందినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే బలరాం జాఖడ్‌ తర్వాత వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించినట్లు ఓంబిర్లా రికార్డులకెక్కుతారు. 


గంటకు 26 మందితో ప్రమాణం 

లోక్‌సభలో గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. తొలిరోజు 280 మందికి, మలిరోజు మిగిలిన సభ్యులకి అవకాశం లభిస్తుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి చేత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. తర్వాత ఆయన లోక్‌సభకు చేరుకొని ఉదయం 11 గంటలకు సభా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. తొలి రెండురోజులు సభ్యుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. 27న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. వాయిదా తర్వాత వర్షాకాల సమావేశాల నిమిత్తం జులై 22న పార్లమెంటు మళ్లీ సమావేశమైనప్పుడు కేంద్ర బడ్జెట్‌ సమర్పించే అవకాశం ఉంది.


పాత సంఖ్యతో చివరి లోక్‌సభ ఇదే?

544 మంది సభ్యులతో జరిగే చివరి లోక్‌సభ ఇదే కావొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినందువల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ఆ మేరకు సీట్లు పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏకకాల ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందువల్ల ప్రస్తుతమున్న సభ్యులతో సభ కొలువుదీరడం ఇదే చివరిసారి కావొచ్చని అంచనావేస్తున్నారు.


ఉప సభాపతి పీఠంతో స్పీకర్‌ ఎన్నికకు లంకె

ప్రస్తుత లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో భాజపాకు 240 మంది సభ్యులున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో కాంగ్రెస్‌ బలం 99. ప్రస్తుతం ఇరు పక్షాలకున్న సంఖ్యాబలాన్ని బట్టి అధికారపక్షం స్పీకర్‌ స్థానాన్ని తీసుకుంటే ఉప సభాపతి పదవిని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే స్పీకర్‌ స్థానానికి తమ తరఫున అభ్యర్థిని రంగంలోకి దింపుతామని హెచ్చరిస్తున్నాయి. దీనికి ఎన్డీయే సమ్మతించకపోతే సభాధ్యక్ష స్థానానికి ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంటుంది. సోమవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. ప్రధానమంత్రితో ఇది మొదలవుతుంది. మహతాబ్‌ ఎంపికపై విపక్షాల అభ్యంతరం నేపథ్యంలో సభలో రగడకు ఆస్కారం ఉంది. ప్రొటెం స్పీకర్‌కు సహకరించే ప్యానెల్‌లో ఉండేందుకు విపక్షంలోని ముగ్గురూ విముఖత వ్యక్తపరిచిన నేపథ్యంలో వారిలో ఒకరైన తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ్‌తో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఆదివారం భేటీ అయ్యారు. కూటమి నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని, ప్యానెల్‌లో చేరలేనని సుదీప్‌ తేల్చిచెప్పేశారు.

విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు సముదాయంలోని పాత భవనం రెండో ప్రవేశమార్గం వద్ద కలుసుకుని, అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఇటీవలి వరకు మహాత్మాగాంధీ విగ్రహం ఎక్కడ ఉండేదో అక్కడ తొలుత వారంతా కలిసి, రాజ్యాంగ ప్రతులను చేతపట్టుకుని నడుచుకుంటూ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారని విపక్ష నేత ఒకరు తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పారు.

.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని