Lok Sabha: కేంద్ర బడ్జెట్‌.. వర్షాకాల సమావేశాల్లోనే!

కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి జులై 3వ తేదీవరకు జరగనుండడం ఖాయమైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు.

Published : 13 Jun 2024 06:21 IST

కొత్త రికార్డు సాధించనున్న నిర్మల
లోక్‌సభ తొలి సమావేశాల తేదీలు ఖరారు
24న ప్రారంభం.. 27న రాష్ట్రపతి ప్రసంగం 

ఈనాడు, దిల్లీ: కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి జులై 3వ తేదీవరకు జరగనుండడం ఖాయమైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపించడంలేదు. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎంపికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే కేవలం అయిదు పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టి, దానిపై చర్చించి, ఆమోదించడం సాధ్యంకాదు. అందువల్ల జులై మూడోవారంలో జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కొత్తసభ ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. నిర్మల వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనత సాధించనున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు. గత లోక్‌సభ ఏర్పడినప్పుడు 2019 జూన్‌ 17 నుంచి జులై 26 వరకే తొలి సమావేశాలు నిర్వహించాలనుకున్నప్పటికీ ఆగస్టు 7 వరకు పొడిగించి, జులై 5న పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

సభ్యుల ప్రమాణాలకు మూడు రోజులు 

కొత్త లోక్‌సభ సభ్యుల ప్రమాణ కార్యక్రమం ఈసారి మూడు రోజులు కొనసాగనుంది. ఆ తర్వాత స్పీకర్‌ ఎంపిక ఉంటుంది. 27 నుంచి రాజ్యసభ 264వ సెషన్‌ ప్రారంభమవుతుంది. ఆరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగిస్తారు. తర్వాత ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను పార్లమెంటుకు పరిచయం చేస్తారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, దానికి ప్రధాని సమాధానం వంటివి ఉంటాయి. ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన మధ్యప్రదేశ్‌ టీకంగఢ్‌ ఎంపీ, ప్రస్తుత కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ గతసారి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించి సభ్యులతో ప్రమాణం చేయించారు. ఇప్పుడు ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం లేదు. ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కేరళ ఎంపీ, కాంగ్రెస్‌ సభ్యుడు కొడిక్కున్నీల్‌ సురేశ్‌ ప్రోటెం స్పీకర్‌ అయ్యే అవకాశం ఉంది. కానిపక్షంలో.. కటక్‌ నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపికైన భాజపా సభ్యుడు భర్తృహరి మహతాబ్‌ ఆ బాధ్యతలు చేపట్టే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు