Gwadar port: పాక్‌ చేపకు చైనా గాలం..!

చైనా ఎక్కడ కాలు పెట్టినా.. అక్కడి సహజసంపదను దోచేస్తుంది. ఈ క్రమంలో మిత్రత్వం అన్నమాటనే మర్చిపోతుంది. ఇప్పుడు చైనాతో అంటకాగిన పాపానికి పాకిస్థాన్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గ్వాదర్‌ పోర్టులో స్థానిక ప్రజలనే పరాయి వారివలే చూడటం..

Updated : 30 Nov 2021 16:05 IST

 గ్వాదర్‌లో డ్రాగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా ఎక్కడ కాలు పెట్టినా.. అక్కడి సహజ సంపదను దోచేస్తుంది. ఈ క్రమంలో మితృత్వం అన్నమాటనే మర్చిపోతుంది. ఇప్పుడు చైనాతో అంటకాగిన పాపానికి పాకిస్థాన్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గ్వాదర్‌ పోర్టులో స్థానిక ప్రజలనే పరాయి వారివలే చూడటం.. వారికి దక్కాల్సిన సహజ సంపదను చైనీయులు దోచేయడంతో ప్రజలు ఉద్యమించడం మొదలుపెట్టారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా గ్వాదర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. మంగళవారం చిన్నపిల్లలు, మహిళలు గ్వాదర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది.

అసలేం జరుగుతోంది..?

ఈ ఏడాది జూన్‌లో వందల కొద్దీ చైనా చేపల వేట పడవలు పాక్‌ బలోచిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టుకు చేరుకొన్నాయి. ఈ ఘటన స్థానిక మత్స్యకారులను హడలెత్తించింది. ఎందుకంటే చైనా చేపలవేట పడవలు యుద్ధనౌకలంత పెద్దగా ఉంటాయి. పాక్‌కు చెందిన అజాదీ న్యూస్‌ అనే సంస్థ చైనా పడవలు చేపల వేటను చేపట్టిన చిత్రాలను ప్రసారం చేసింది. ఈ పడవలు మొత్తం ఒక చేపల ఎగుమతి సంస్థకు చెందినవిగా గుర్తించారు. గ్వాదర్‌ ప్రాంతంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు చేపల వేటపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగడంతో అప్పట్లో ఓ ఐదు నౌకలను చేపలతో సహా పాకిస్థాన్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

కొన్నాళ్ల నుంచి ఊపందుకొన్న ఆందోళనలు..

గత కొన్నాళ్లుగా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. గ్వాదర్‌ పట్టణంలో అనవసరంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు తొలగించాలని.. చైనా చేపల వేట పడవలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టారు. దీనికి జమాతే ఈ ఇస్లాం బలోచిస్థాన్‌ జనరల్‌ సెక్రటరీ హిదాయత్‌ ఉర్‌ రహ్మన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

స్థానిక విషయాల్లో చైనా జోక్యాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీపెక్‌  ప్రాజెక్టు వల్ల ఎటువంటి ప్రయోజనం స్థానికులకు లభించలేదని పేర్కొంటున్నారు. స్థానిక సంపదను చైనా దోచుకుంటోందని కొన్ని వారాల్లో దాదాపు మూడు భారీ ఆందోళనలు జరిగాయి. స్థానిక ప్రజలనే పరాయి వారిగా చేసి చైనా చేపల వేట పడవలకు పాక్‌ ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇక నీరు, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాలు కూడా పాక్‌ ప్రజలకు అందడంలేదు.

దుర్భేద్యంగా గ్వాదర్‌పోర్టు..

చైనా పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టు ఉన్న గ్వాదర్‌ సిటీ చుట్టూ చైనా ఏకంగా 10 అడుగుల ఎత్తున 30 కిలోమీటర్ల మేరకు ఇనుప కంచెను నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఇది కొంత మేరకు పూర్తి చేసింది. దాదాపు 9 వేల మంది  పాక్‌ సైనికులు, 6 వేల మంది చైనా సైనికులు ఇక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకొంటున్నారు. ఇప్పటికే గ్వాదర్‌ పోర్టును చైనా కంపెనీలకు 40ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని